నీళ్లు, నిధులు, నియామకాలు…ఈ మూడు అంశాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చింది. అక్కడి ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ప్రజా ఉద్యమానికి టీఆర్ఎస్ వంటి ఉద్యమ నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీలు, ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు,నిపుణులు మద్దతు తెలపడంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి కాంగ్రెస్ అధిష్టానం మనసు కరిగించింది.
దీంతో, ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది. ఆనాడు …ఈనాడు…ఏనాడైనా సరే….ఉమ్మడి ఏపీ పాలకుల పాలన వల్ల తెలంగాణ ప్రజల్లో లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ ఉంది కానీ…తెలంగాణలో కుల రాజకీయాలు తక్కువనే చెప్పాలి. అందుకే, తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా నమ్ముకున్న టీఆర్ఎస్ కు అక్కడి ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సన్నాహాలు మొదలుబెట్టిన నేపథ్యంలో తెలంగాణలో కుల రాజకీయాల అంశం తెరపైకి వచ్చింది.
రెడ్డి సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకే షర్మిల పార్టీ పెడుతున్నారని, దీంతో, ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు పరిచయం లేని కుల రాజకీయాలను అక్కడ షర్మిల పరిచయం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఇప్పటికే రెండు సామాజిక వర్గాల మధ్య పోరు నడుస్తున్న తరహాలోనే, తెలంగాణలోనే భారీ సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారన్న టాక్ వస్తోంది.
కుల రాజకీయాలతో ఏపీ భ్రష్టుపట్టిపోయిందని, ఆ కంపు రాజకీయాలు తమ దగ్గర లేవని తెలంగాణ ప్రజలు సంతోషపడేవారని, కానీ, ఇపుడు షర్మిల ఎంట్రీతో తెలంగాణకూ ఆ కుల కంపు రాజకీయాలు పాకాయని అనుకుంటున్నారు. అయితే, తెలంగాణ ప్రజలు ఇన్నాళ్లూ బలంగా నమ్మిన ప్రాంతీయ భావం, లోకల్ సెంటిమెంట్ బలం ముందు ఈ కుల ఫార్ములా రాజకీయాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయన్నది వేచి చూడాలి.