తాజాగా విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ నుంచి పరోక్షంగా మద్దతు లభించిందని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. దాంతోపాటు,ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలైన బీఆర్ఎస్ కు పోలైన ఓట్ల శాతంలో తేడా కేవలం 2.07.
రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీకి పోలైన ఓట్ల శాతం 1.40. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే కచ్చితంగా 2-3 శాతం ఓట్లు చీల్చి ఉండేది. ఆ చీలిన ఓట్లు అధికార బీఆర్ఎస్ కు మరోసారి అధికారాన్ని కట్టబెట్టి ఉండేవి.అయితే, కొందరు మాత్రం సీమాంధ్రులు గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులు ఓటు వేయడానికి రాలేదని, అందుకే బీఆర్ఎస్ కు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారి అరెస్ట్ నేపథ్యంలో అయన అభిమానుల పేరిట చేసిన హడావుడి బీఆర్ఎస్ ఓటుగా మారలేదని అంటున్నారు.
కానీ, గత 10 సంవత్సరాలలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఆ విమర్శలో పస లేదనిపించడం ఖాయం. ఉమ్మడి ఏపీలో రోశయ్య గారి హయాంలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ డివిజన్లు గెలుచుకుంది. ఆనాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి 45 డివిజన్లు దక్కించుకుంది.
ఆ తర్వాత జరిగిన గ్రేటర్ పోల్స్ లో కాంగ్రెస్ కన్నా టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించింది సీమాంధ్ర ఓటర్ల వల్లే. ఈ రోజు గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఈ మాత్రం సీట్లు వచ్చాయంటే అది టీడీపీ ఓటర్ల చలవే అన్నది అక్షర సత్యం. కాకపోతే, బీఆర్ఎస్-బీజేపీ కలిసిపోయాయి కాబట్టి ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ కు వచ్చాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బీజేపీ వణికించిన సంగతి మరచిపోకూడదు. ఇక, గ్రేటర్ లో కాంగ్రెస్ తరఫునకొందరు బలహీనమైన అభ్యర్థులు నిలబడడం కూడా మైనస్.
కాబట్టి, టీడీపీ ఓటర్లు, సీమాంధ్ర ఓటర్లు, చంద్రబాబు అభిమానుల వల్ల గ్రేటర్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు లాభమేగానీ నష్టం జరగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని టీడీపీ అభిమానులు అంటున్నారు.