ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతుల సమస్యలపై కేంద్రంతో యుద్ధం చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కానీ, ఇంతవరకు ప్రధాని మోడీ అపాయింట్ తో పాటు మరే కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ కు దొరకలేదు. రేపో మాపో అపాయింట్ మెంట్ దొరుకుతుందని చెబుతున్నారు. అయితే, తన భార్య చికిత్స కోసమే కేసీఆర్ హస్తినలో పర్యటిస్తున్నారని మరో ప్రచారం జరుగుతోంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్, కవితల మధ్య వచ్చిన భేదాభిప్రాయాలను సెట్ చేసేందుకు కేసీఆర్ ఢిల్లీ టూర్ వేశారని మరో పుకారు వినిపిస్తోంది.
ప్రధాని మోడీ, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల అపాయింట్మెంట్ను తెలంగాణ సీఎంవో వర్గాలు కోరాయని తెలుస్తోంది. కానీ, ప్రధాని, కేంద్ర మంత్రులు రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, నేడో, రేపో కచ్చితంగా అపాయింట్మెంట్ వస్తుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రధాని, కేంద్రమంత్రులను కలిసిగానీ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
దీంతో, అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అన్న ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరకని నేపథ్యంలో కేసీఆర్ తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే, కేంద్రంలో చక్రం తిప్పడానికి ససేమిరా అంటోన్న కవిత…రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ దశలో కేటీఆర్, కవితల మధ్య వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. చివరకు ఇద్దరికీ నచ్చజెప్పిన కేసీఆర్…కవితను మరోసారి ఎమ్మెల్సీ చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ కేటీఆర్, కవితల మధ్య గ్యాప్ వచ్చిందని చాలాకాలంగా పుకార్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీకి సైతం గైర్హాజరైన కవిత, అంతకుముందు రాఖీ కట్టేందుకు కూడా కేటీఆర్ ను కలవకపోవడం చర్చనీయాంశమైంది.