గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్.. అప్పటి నుంచి ప్రతిపక్షాలపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, టీడీపీని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందుకు ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కొందరు వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడమే నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. తన భార్యను మాటలనడంతో బాబు కన్నీళ్లు పెట్టుకోవడం.. తమ ఇంటి ఆడపడుచుపై వ్యాఖ్యల నేపథ్యంలో నందమూరి కుటుంబం స్పందించడంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
వాళ్లకు పడదు..
ఇక ఇప్పుడేమో బాబుకు మద్దతుగా నిలుస్తున్న మీడియాను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి బాబుకు మద్దతుగా ఎల్లో మీడియా సంస్థలు నిలుస్తున్నాయని ఎప్పటి నుంచో వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
అయితే దీని వెనుక వైసీపీ ప్రభుత్వమే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆంధ్రజ్యోతి ముందుంటుందని, జగన్కు ఆర్కేకు పడదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై సీఐడీ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
జీరో ఎఫ్ఐఆర్..
ఈ నెల 10న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్లోని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో రూ.242 కోట్ల కుంభకోణం నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో మరికొంత మందితో కలిసి అక్కడికి చేరుకున్న ఆర్కే తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.
దీంతో మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 353, 341, 186, 120బీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆర్కేతో పాటు న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియోగ్రాఫర్ రమేశ్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని గుంటూరులోని మేజిస్ట్రేట్ కోర్టుకు పంపించారు. విచారణ కోసం దాన్ని తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పంపించనున్నారు.
కక్ష్య పూరితంగానే..
ఆర్కేపై సీఐడీ కేసు పెట్టడం వెనక వైసీపీ ప్రభుత్వ కక్ష్యపూరిత వైఖరి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్మీనారాయణ, ఆర్కే ఎప్పటి నుంచో స్నేహితులు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే చూసి వద్దామని ఆర్కే ఆయన నివాసానికి వెళ్లారని సమాచారం. ఆ సమయంలో సోదాలు జరిగేంత వరకూ దూరంగా ఉండాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించగా…ఆర్కే ఒప్పుకున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడేమో విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
ఈ నెల 10న సోదాలు జరిగితే వెంటనే పోలీసుల సాయంతో ఆర్కేపై కేసు పెట్టకుండా.. 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకూ ఎందుకు ఆగారనేది సందేహాలు రేకెత్తిస్తోంది. మరోవైపు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏదైనా ప్రమాదం, అత్యాచారం లాంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు తక్షణమే స్పందించేందుకు ఉపయోగపడుతోంది. అలాంటిది ఆర్కేపై సీఐడీ ఎక్కడో అమరావతిలో జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఐడీ నేరుగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో జీరో ఎఫ్ఐఆర్ను కోర్టు ఆమోదించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.