సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాకింగ్ కామెంట్లు చేశారు. దుర్మార్గుడైన జగన్‌కి ఏసుక్రీస్తుతో పోలికేంటని గోరంట్ల ప్రశ్నించారు. జగన్‌ను ఇంటికి పంపటమే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన జగన్ అట్టర్ ప్లాప్ సీఎం అని సెటైర్లు వేశారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వ జీవోలు రహస్యంగా ఉంచే దద్దమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం విజయదుందుభి మోగించిందని గోరంట్ల అన్నారు. రాష్ట్రమంతా తిరిగి ప్రజల సమస్యలు లోకేష్ తెలుసుకున్నారని కితాబిచ్చారు. టీడీపీపై జగన్ వి తప్పుడు ఆరోపణలని మండిపడ్డారు. సిట్టింగ్‌లను సీఎం జగన్ మారుస్తున్నారని, రామచంద్రాపురంలో పనిచేయని మంత్రి రాజమండ్రి రూరల్‌లో పని చేస్తారా అని చురకలంటించారు. జగన్ తన వైఫల్యాలను మంత్రులు, ఎమ్మెల్యేల పైకి నెట్టేస్తున్నాడని, మంత్రులకు స్థాన చలనమేంటని ప్రశ్నించారు.
ఒకచోట అవినీతిపరుడైన వాడు ఇంకొక చోట పనిచేస్తాడా? అని గోరంట్ల నిలదీశారు. ప్రతిపక్ష నేతగా అంగన్వాడీలకు అలివిమాలిన హామీలిచ్చిన జగన్..సీఎం అయిన తర్వాత వాటిని ఎందుకు అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. సజ్జల పెద్ద గాడిద అని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను జైల్లో పెడతామని గోరంట్ల అన్నారు. జగన్ వద్దు బాబోయ్ అని జనం అంటున్నారని విమర్శించారు.
పార్టీ కోసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి గత ఎన్నికల్లో గెలిచానని, సిట్టింగ్‌లకు స్థాన చలనం లేదని చంద్రబాబు చెప్పారని అన్నారు. అయితే, ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ అభ్యర్థులను నిర్ణయిస్తారన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికే సీటు అని చెప్పారు. డబ్బులిచ్చి జగన్ దొంగ సర్వేలు చేయుంచుకొని సాక్షి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు.