జగన్ పాలనలో అధికార దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ నియంతను తలపిస్తున్నారని, ఏక పక్ష నిర్ణయాలతో రాష్ట్ర పేరు ప్రతిష్ఠలను దిగజారుస్తున్నారని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను భద్రతా కారణాలు చెప్పి కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అదే తరహాలో తాజాగా భద్రతా కారణాల పేరు చెప్పి అధికారులు చేసిన మరో పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ఇంటి దగ్గర ఉన్న భరతమాత విగ్రహాన్ని అధికారులు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. హడావిడిగా భరత మాత విగ్రహాన్ని పెకిలించిన అధికారులు…జగన్ భద్రత కోసమని, రోడ్ల విస్తరణ కోసం తొలగించామని, రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులను తాలిబన్లతో పోల్చిన లోకేష్… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైకాపాబన్లు అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని జగన్ కంకణం కట్టుకున్నారని, అందుకే గతంలో నిరుపేదల ఇళ్లు కూల్చేసారని మండిపడ్డారు.
ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై జగన్ గునపం దింపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని లోకేష్ విమర్శలు గుప్పించారు. పెకిలించిన భరత మాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలని, చేసిన మూర్ఖపు పనికి వెంటనే యావత్ భారత ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. భరతమాత కన్నా జగన్ గొప్పవాడా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.