జూన్ 21న మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణg చేశారు. తొలి రోజు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచింది. పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ సభలో అడుగుపెడుతున్న, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
అధికారం ఉందనే అహంకారంతో గతంలో వైసీపీ నేతలు పవన్‌పై తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా గెలవని పవన్ ఇంకేం రాజకీయాలు చేస్తారని విమర్శించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ మంత్రులుగా ఉన్నప్పుడు నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. అప్పుడలా మాట్లాడిన నాయకుల్లో ఒక్కరూ ఇప్పుడు అసెంబ్లీలో లేరు. ఈ ఎన్నికల్లో దారుణ పరాభవంతో వీళ్లంతా రోడ్డున పడ్డారు. కానీ పవన్ మాత్రం భారీ విజయంతో దర్జాగా సభలో అడుగుపెట్టారు.
పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ నేతలు లబోదిబోమంటున్నారు. అదే సమయంలో సభలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించనున్నారు. పార్ట్ టైమ్ పొలిటిషియన్, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ విమర్శలు చేసినా పట్టుదలతో సాగిన పవన్ ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ పవర్ స్టార్ అయ్యారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే కదా కావాల్సింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.