కరోనాకు చెక్ చెప్పేందుకు వచ్చిన టీకాల్లో ఆస్ట్రాజెనెకాకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. అయితే..ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టేస్తున్న నేపథ్యంలో.. కొందరికి సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా రావటమే కాదు.. మరణిస్తున్న ఉదంతాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ టీకా విపరిణామాలు ఎక్కువగా ఉండటంతో దీన్ని నిషేధించేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ టీకాను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి.
టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డ కడుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే డెన్మార్క్.. నార్వే.. ఆస్ట్రియా.. ఎస్టోనియా.. లిథువేనియా.. థాయిలాండ్.. ఐస్ లాండ్ దేశాలు ఈ టీకాపై బ్యాన్ విధించాయి.
తాజాగా ఐర్లాండ్ కూడా ఈ టీకాపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఇటీవల ఈ టీకాను తీసుకున్న ముగ్గురు ఆరోగ్య కార్యకర్తల్లో తీవ్రమైన రక్తస్రావం.. రక్తం గడ్డకట్టడం.. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి.
దీంతో.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఓవైపు ప్రపంచంలోని పలు దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాను బ్యాన్ చేస్తుంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఈ టీకాతో ఎలాంటి ప్రమాదం లేదని.. బోలెడన్ని ఉపయోగాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు తగ్గట్లే.. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా అదే మాటను చెబుతోంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో వినియోగిస్తున్న ఈ టీకా విషయంలో మరింత లోతుగా సమీక్షించాలని నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు కోవిషీల్డ్.. కోవాగ్జిన్ రెండు టీకాల్ని ఇస్తున్న విషయం తెలిసిందే.