అనుకోని పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నకు అరెస్టు వారెంట్ ఇష్యూ అయ్యింది. ఇంతకీ ఈ వారెంట్ ఇష్యూ చేసిందెవరు? ఏ అంశం మీద ఇదంతా జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఇరాక్ దేశం ఈ వారెంట్ ను జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న ట్రంప్ ను అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఇరాక్ కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఇరాక్ సైనికాధికారిని డ్రోన్ తో హత్య చేసిన ఉదంతంతో ఆయనకు జారీ అయినట్లుగా చెబుతున్నారు. అబూ మహదీ కుటుంబం నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వా వారెంట్ జారీ చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. జరిగిన హత్యలపై దర్యాప్తు కొనసాగుతుందని ఇరాక్ సుప్రీం జ్యుడిషియల్ స్పష్టం చేసింది. తమ సైనికాధికారిని డ్రోన్ సాయంతో అమెరికా అధికారులు లేపేశారు.
ఈ ఉదంతానికి ట్రంప్ బాధ్యత వహించాలని ఇరాక్ డిమాండ్ చేస్తోంది. తాజాగా అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది ఒక్క ట్రంప్ మీద మాత్రమే కాదు.. ఆయన ఆదేశాల్ని పాటించి.. అమలు చేసిన 47 మంది ఇతర అమెరికన్ అధికారుల్ని అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఇంటర్ పోల్ సహకరించాలని కోరుతున్నారు. అంతేకాదు.. అమెరికన్ అధికారుల్ని అరెస్టు చేసేందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ను కోరింది. ఇరాక్ అడిగినంతనే ఇంటర్ పోల్ ఓకే అనే అవకాశం ఉండదు. అయితే.. తమ సైనికాధికారిని హతమార్చిన నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా అతన్ని వదిలేది లేదని ఇరాక్ ఇప్పటికే పేర్కొనటం గమనార్హం. చూస్తుంటే.. అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో మరెన్ని పరిణామాలకు కారణమవుతాయేమో చూడాలి.