అంతర్జాతీయ క్రికెట్‌కు ఏమాత్రం తక్కువ కాదు ఐపీఎల్. పేరుకిది దేశవాళీ టోర్నీనే కానీ.. ఇక్కడ ఉండే తీవ్రతే వేరు. ప్రతి మ్యాచ్ కీలకమే. ఆటగాళ్ల నుంచి కోచింగ్ సిబ్బంది వరకు అందరి పని తీరు మీదా నిరంతరం సమీక్ష జరుగుతుంటుంది. ప్రదర్శన బాగా లేదంటే చోటు గల్లంతయిపోతుంది. పదవులు ఊడిపోతాయి. లీగ్ మధ్యలో కూడా మార్పులు సహజమే.
గతంలో కొందరు ఆటగాళ్ల కెప్టెన్సీ మధ్యలో ఊడిపోవడం తెలిసిందే. ఆటగాళ్లు కూడా స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సందర్భాలున్నాయి. కొన్నేళ్ల కిందట గౌతమ్ గంభీర్ స్వచ్ఛందంగా ఢిల్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన అతను.. ఆ జట్టు ప్రదర్శన పడిపోయాక తప్పుకోవాల్సి వచ్చింది.
అప్పుడు కోల్‌కతా పగ్గాలందుకున్న దినేశ్ కార్తీక్.. ప్రస్తుత సీజన్లో అర్థంతరంగా కెప్టెన్సీని విడిచి పెట్టాల్సి వచ్చింది. కార్తీక్ సారథ్యంలో కోల్‌కతా గత సీజన్లలో వైఫల్యమే చవిచూసింది. ఈసారి కూడా ఏమంత గొప్పగా ఆడట్లేదా జట్టు. జట్టు సంగతలా ఉంచితే కార్తీక్ ఆటగాడిగా ఫెయిలవుతున్నాడు. కెప్టెన్‌గా ప్రభావం చూపలేకపోతున్నాడు.
ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అర్ధశతకం సాధించాడు. దానికి ముందు, వెనుక అన్నీ వైఫల్యాలే. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో మోర్గాన్, రసెల్‌లను కాదని అతను ముందు రావడాన్ని అందరూ తప్పుబట్టారు. అతడి కంటే ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచకప్ కూడా అందించిన మోర్గాన్ సమర్థుడన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. ఈ సంగతి కార్తీక్‌కు కూడా అర్థమైనట్లుంది. అతను స్వచ్ఛందంగా కోల్‌కతా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తాను బ్యాటింగ్ మీద దృష్టపెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఐతే యాజమాన్యం ఒత్తిడి మేరకే అతను తప్పుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.