తనకు మించిన తోపు మరొకరు లేరన్న భావన ఉన్నప్పుడు.. అలాంటిదే ప్రజల మెదళ్లలో బలంగా నాటేటప్పుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ కీలకాంశాన్ని మిస్ అయినట్లుగా కనిపిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎవరేం చేసినా.. తన బొమ్మతోనే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని జగన్ మాత్రమే కాదు.. ఆయన పార్టీకి చెందిన వారంతా బలంగా నమ్ముతారు.
అదే సమయంలో చంద్రబాబు చేసిన తప్పులే జగన్ ను గెలిచేసేలా చేశాయన్న విషయాన్ని మాత్రం అస్సలు ఇష్టపడరు. కారణం.. ఈ మాటలోనూ జగన్ స్థాయి తగ్గుతుందన్న ఫీలింగ్ వారికి ఉంటుంది. అయితే.. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించనప్పుడు వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. తాజాగా అలాంటి ఇబ్బందే జగన్ అండ్ కోకు ఎదురైంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాల్ని సమకూర్చే ఐప్యాక్ ఒకప్పటి అధినేత ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని కలవటం.. ఆయనతో నాలుగు గంటల పాటు భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
పీకేనే స్వయంగా ఎంట్రీ ఇచ్చి.. చంద్రబాబుతో భేటీ కావటం.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేపథ్యంలో టీడీపీ అభిమానులు.. మద్దతుదారులు.. సానుభూతిపరులు హ్యాపీగా ఉంటూ.. రెట్టించిన ఉత్సాహాన్ని తెచ్చేసుకుంటే.. అందుకు భిన్నంగా అధికార వైసీపీని అభిమానించి.. ఆరాధించే వారంతా అయోమయంలో పడిన పరిస్థితి. ఇదేం ట్విస్టు అంటూ షాక్ తిన్న పరిస్థితి. దీనికి కారణం.. ఇప్పటికి ఐప్యాక్ సంస్థ తమ పార్టీకి సేవలు అందిస్తున్నప్పుడు.. ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుతో ఎలా భేటీ అయ్యారన్న ప్రశ్న వారి మదిలో మెదులుతోంది.
అయితే.. పీకే సొంత రాష్ట్రమైన బిహార్ లో తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలన్న ఆలోచనతో తాను ఏర్పాటు చేసిన ఐప్యాక్ కు గుడ్ బై చెప్పేశారు. ఐప్యాక్ తో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ఆయన కింద పని చేసిన వారు ఇప్పుడా సంస్థ సారథ్యాన్ని చేపట్టారు. మరికొందరు..బయటకు వచ్చేసి ఎవరి దుకాణం వారు పెట్టుకున్నారు. పీకేకుపాత సహచరుడైన రాబిన్ శర్మ టీం ఇప్పటికే టీడీపీకి పని చేస్తోంది. అదే సమయంలో. వైసీపీకి పీకే లేని ఐప్యాక్ టీం పని చేస్తోంది.
పీకే చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో భారీగా డ్యామేజ్ జరిగిందన్న భావన ఆ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిలో కలిగినట్లుగా చెబుతారు. అందుకే.. ఆ నష్టనివారణ కోసం ఐప్యాక్ హడావుడిగా ఒక ట్వీట్ చేసింది. దాని సారాంశం ఏమంటే.. ఏడాదిగా వైసీపీ కోసం పని చేస్తున్నాం. 2024లో జగన్ గెలిచే వరకు శ్రమిస్తూనే ఉంటాం’ అని పేర్కొంది. ఏడాది నుంచి పని చేస్తున్నామంటే.. అంతకు ముందు పని చేయట్లేదనేగా సారాంశం. ఈ మాటను అండర్ లైన్ చేసుకుంటే.. పీకే లేని ఐప్యాక్ జగన్ అండ్ కో వద్ద ఉందన్న నిజం బయటకు వస్తుంది. అయినా.. జగన్ కు మించిన తోపు ఇంకెవరు లేరని బలంగా నమ్మే వేళలో.. పీకే లాంటోళ్లు లేకపోతే మాత్రం ఏమవుతుందన్నట్లుగా ఉండాలి కానీ.. ఐప్యాక్ నుంచి వచ్చిన ట్వీట్ పోస్టు ఏపీ అధికారపక్షం బేలతనాన్ని చెప్పకనే చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ అవసరమా?