ఆంధ్రప్రదేశ్ పరువుప్రతిష్ఠలను సీఎం జగన్ బజారుకీడ్చారు. భారీ అప్పు తెచ్చేందుకు ఆయన వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన బాండ్లు రెండోసారి బోల్తా పడ్డాయి. ఇన్వెస్టర్లు వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో రూ.11,600 కోట్ల అప్పు తేవాలన్న జగన్ ఆశలు నెరవేరలేదు. రాజ్యాంగ విరుద్ధంగా ఆదాయం మళ్లిస్తూ, అడ్డగోలుగా అప్పులు తెస్తున్న ఆయన ప్రభుత్వం.. తాజాగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో బాండ్లు విడుదల చేసింది. మొదట రూ.2,000 కోట్ల ఇష్యూ ఓవర్సబ్స్ర్కైబ్ అయితే మరో రూ.9,600 కోట్లు అప్పు తెచ్చుకోవాలనేది ఎత్తుగడ.
అయితే ఆ రూ.2,000 కోట్ల మేర బాండ్లను కూడా ఇన్వెస్టర్లు సబ్‌స్ర్కైబ్ చేసుకోలేదు. జగన్ ప్రభుత్వంపై వారికి నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. ఇంతకుముందు మే 15వ తేదీన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా బీఎస్ఈలో విడుదల చేసిన బాండ్లు కూడా ఫెయిలయ్యాయి. ఆ బాండ్లను అప్పుడు బీఎస్ఈలో లిస్ట్ చేయలేదు. పైగా వాటిలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్. జగన్ ప్రభుత్వం అప్పులను భవిష్యతలో ఆదాయం సమకూర్చే ప్రాజెక్టుల కోసం ఉపయోగించడం లేదు కాబట్టి… ఆ బాండ్ల రీ పేమెంట్, వడ్డీ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో అనుమానాలు పెరిగాయి. అవి అన్‌లిస్టెడ్ కాబట్టి వడ్డీరేటు కూడా చాలా తక్కువ.
దీంతో అప్పట్లో కూడా ఇన్వెస్టర్లు ఎవరూ మొగ్గు చూపలేదు. దాంతో ప్రభుత్వం రెండోసారి ఈ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను బీఎస్ఈలో లిస్టు చేసింది. ఇందుకోసం ఒక ఊరూపేరు లేని సంస్థ ద్వారా ‘ఏఏ+’ అని రేటింగ్ ఇప్పించుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీసీఆర్డీఏ, ఏపీసీపీడీసీఎల్, పీఎఫ్సీ, ఇతర ఎనర్జీ సంస్థల బాండ్లన్నీ బీఎస్ఈలో ‘బీ’ రేటింగ్‌తో ట్రేడ్ అవుతుండగా… బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లకు ‘ఏఏ+’ రేటింగ్ ఎలా వస్తుందని ఇన్వెస్టర్లకు సందేహం వచ్చింది. అలాగే అంతకుముందు రెండు దఫాలుగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.16,000 కోట్లను ప్రభుత్వం ఏం చేసింది? అంత భారీ అప్పు చేసి సాధించింది ఏమిటి? అన్నది ఇన్వెస్టర్లను ఆలోచింపజేసింది.
ఆ డబ్బును అర్థవంతంగా, ఖజానాకు ఆదాయం సమకూర్చే విధంగా ఖర్చు చేసి ఉంటే.. ఈ సారి బేవరేజెస్ బాండ్లు ఫెయిలయ్యేవి కాదనేది స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. పైగా ఈ తరహా బాండ్లకు సెకండరీ మార్కెట్ లేదని, లిక్విడిటీ ఉండదని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు అమ్ముకోవాలనుకుంటే ప్రభుత్వానికి ఈ బాండ్ల అరేంజర్గా ఉన్న ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ తప్ప ఎవరూ కొనరని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం బాండ్ల చెల్లింపులకు గ్యారెంటీ ఇస్తుందని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని, ఎందుకంటే ప్రభుత్వానికి చెందిన ఇతర సంస్థల బాండ్లు డిఫాల్ట్ అయి రేటింగ్‌లు తగ్గించుకొని ట్రేడ్ అవుతున్న విషయం ఇన్వెస్టర్లందరికీ తెలుసని చెబుతున్నారు.
‘గ్యారెంటీ’పై నమ్మకం లేకనే!
ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ బాండ్లు వేలం వేసి అప్పులు సమీకరిస్తోంది. ఈ బాండ్లకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన వస్తోంది. వీటికి స్వయంగా ఆర్బీఐ బ్యాంకర్‌గా వ్యవహరిస్తూ గ్యారెంటీ ఇస్తోంది. బాండ్ల తాలూకు అసలు, వడ్డీ చెల్లించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైనా, రాష్ట్ర ఖజానాలోని డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా ఆర్బీఐ ఇన్వెస్టర్లకు చెల్లిస్తుందన్న మాట. అయితే బేవరేజెస్ బాండ్లకు ఆర్బీఐతో సంబంధం లేదు. నేరుగా రాష్ట్రప్రభుత్వమే వాటికి గ్యారెంటీ ఇస్తోంది. అందుకే వాటిని ఎవరూ నమ్మడం లేదు.
ప్రభుత్వం మారితే ఎలా?
రాష్ట్రంలో మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో పాలనా పరమైన నిర్ణయాలతో ప్రభావితమయ్యే పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడతారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై వసూలయ్యే వ్యాట్ ను జగన్ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్‌గా మార్చి ఆ ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తోంది. ప్రభుత్వం ఒక్క జీవోతో, ఒక్క చట్టసవరణతో ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తోంది.
ఒకవేళ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే స్పెషల్ మార్జిన్ ఉంటుందా? ఉండదా? మద్యం పాలసీ మారితే ఎలా? అనే అనుమానాలు ఇన్వెస్టర్లలో భయానికి కారణం. మద్యంపై వ్యాట్‌ను స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ కార్పొరేషన్‌కు మళ్లించి, దానిని సొంత ఆదాయంగా చూపించి ఇప్పటికే రూ.16,000 కోట్ల అప్పు తెచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఆ అప్పు, ఆ బాండ్లపై పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏమిటని ఇప్పటికే ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అందుకే బేవరేజెస్ బాండ్లను బీఎస్ఈలో లిస్టు చేసినా, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినా వారు నమ్మలేదు.
అడిగినంత రేటింగ్!
స్టాక్ మార్కెట్ వ్యవస్థలో ప్రముఖ రేటింగ్ సంస్థలు క్రిసిల్, ఇక్రా, కేర్ ఇచ్చే రేటింగ్స్‌ను ఇన్వెస్టర్లు ఎక్కువగా నమ్ముతారు. కానీ జగన్ ప్రభుత్వం పెద్దగా ఎవరికీ తెలియని సంస్థను ఆశ్రయించింది. బీఎస్ఈలో లిస్ట్ చేయాలంటే రేటింగ్ తప్పనిసరి కావడంతో ఆ సంస్థ ద్వారా కావలసినంత రేటింగ్ ఇప్పించుకుంది. కానీ ఇన్వెస్టర్లు ఎవరూ నమ్మలేదు.