చిలికి చిలికి గాలివానలా మారింది ఏపీ ప్రభుత్వ నిర్ణయం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన జగన్ సర్కార్.. కోనసీమ పేరు ముందు బీఆర్ అంబేడ్కర్ పేరును చేర్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటంతో పాటు.. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేశారు.
కోనసీమ పేరు మాత్రమే ఉండాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ను సాధించుకోవటం కోసం నిన్న చలో అమలాపురం కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వటం.. అది కాస్తా హింసాత్మకంగా మారటంతో పాటు.. అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్ కు చెందిన రెండు ఇళ్ల (ఒకటి నివాసం ఉండేది.. రెండోది నిర్మాణంలో ఉన్నది)కు ఆందోళనకారులు నిప్పు అంటించటంతో పాటు.. ఎమ్మెల్యే ఇంటిని సైతం తగలబెట్టారు. ఇదే కాకుండా దాదాపు వంద మంది పోలీసు అధికారులు..సిబ్బందికి గాయాలయ్యాయి. పలు వాహనాల్ని దగ్థం చేశారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న పోలీసు బలగాల్ని అమలాపురం పట్టణంలో దించేశారు.
ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల్లో.. ఈ రోజు కోనసీమ సాధనా సమితి చలో రావులపాలెం పిలుపును ఇవ్వటం పోలీసులకు ఇప్పుడో పెద్ద సవాలుగా మారింది.
నిన్న చోటు చేసుకున్న అనుభవాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటంతో పాటు..పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. మంగళవారం ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రావటం.. రాళ్లు రువ్వటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటంతో పాటు.. పోలీసులకు పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. మంగళవారం పరిస్థితులు ఈ రోజు రిపీట్ కాకుండా ఉండేందుకు వీలుగా పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూను విధించారు.
సెక్షన్ 144 అమల్లో ఉంది. ఏమైనా.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పాటు.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.