టీడీపీలో కొందరిని బాగు చేయడం.. ఎవరికీ సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు.. పార్టీని అధికారం లోకి తెచ్చేందుకు చంద్రబాబు శతథా ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నుమూసినా.. తెరిచినా.. ఆయన పార్టీ గురించే ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎలా రావాలా? అనే ఆలోచనలు చేస్తున్నారు. మరి ఆయనతో పాటు సమానంగా రాజకీయాల్లో ఉన్న పార్టీ సీనియర్లు మాత్రం.. ఇవే వీ తమకు పట్టవనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాలు వారితోనే పోవడం లేదు.. పార్టీని తీవ్రంగా నాశనం చేస్తున్నాయి.
ఏం జరిగింది?
2014 ఎన్నికలకు ముందు కొందరు సీనియర్ నాయకులను చంద్రబాబు పిలిచి మరీ.. సైకిల్ ఎక్కించుకు న్నారు. వీరికి టికెట్లు కూడా ఇచ్చారు. వారు గెలిచేలా కూడా చేశారు. ఇలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్ అత్యంత ముఖ్యులు. పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీ.. ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని విజయం దక్కించుకున్నారు. తర్వాత.. పార్టీ తరఫున కానీ.. ప్రభుత్వం చేసిన మంచి పనులను కానీ.. వారు ప్రచారం చేయలేదు. అయినా.. చంద్రబాబు సీనియర్లు అన్న ఉద్దేశంతో వారిని వదిలేశారు.
టీడీపీ కోసం.. అహర్నిశలు కష్టపడుతున్ననేతలతో ఈ బ్రదర్స్ వివాదాలు పడుతున్నా.. చంద్రబాబు వారించారు. పోనీలే సీనియర్లు కదా.. వారే మారతారులే అనుకున్నారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు తాము తప్పుకొని.. తమ పిల్లలకు టికెట్లు ఇవ్వాలని అన్నా, చంద్రబాబు ముందు వెనుక ఆలోచించకుండా.. సరే.. అన్నారు. అస్మిత్, పవన్‌లకు టికెట్లు ఇచ్చారు. అయితే.. వారిద్దరూ ఓడిపోయారు. పోనీ.. అప్పటి నుంచైనా.. పార్టీలో బలంగా ఉన్నారా.? అంటే అదీ లేదు.
పైగా.. బలంగా ఉన్న నేతలకు పొగ పెడుతున్నారు. రెండు కీలకనియోజకవర్గాల్లో.. తమహవా ప్రదర్శిస్తూ.. ఉన్న టీడీపీ బలాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం అర్బన్, సహా పుట్టపర్తి నియోజకవర్గాల్లో తమ హవానే సాగించాలని జేసీ బ్రదర్స్ చేస్తున్న ప్రయత్నాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఈ క్రమంలోనే మంగళవారం నలుగురు జేసీ వర్గీయుల సస్పెన్షన్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫార్సు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ వర్గీయులు తీర్మానం చేశారు. అదేసమయంలో పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇచ్చినా.. ఓడిద్దామంటూ.. తీర్మానం చేశారు. మరి ఇలాంటి పరిణామాలతో టీడీపీ వీక్ కాదా.. మరి చంద్రబాబు ఇప్పటికైనా.. వారిని మారుస్తారా? లేక.. పార్టీ నుంచి తప్పిస్తారా? తేల్చేయాలని..ఇక్కడి నిజమైన టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.