ఏపీలో పీఆర్సీ వ్యవహారం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వతేదీ జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, జీతాలను ప్రాసెస్ చేయబోమని, పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు కావాలని ప్రభుత్వ ఉద్యోగులు, ట్రెజరీ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు మంత్రులతో స్టీరింగ్ కమిటీ భేటీ కూడా జరిగింది. అంతకుముందు పీఆర్సీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్ట ప్రకారం సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని పిటిషన్ లో పేర్కొంది.
ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు.అంతేకాదు, కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు…దానిపై కొద్ది రోజుల క్రితం విచారణ జరిపింది. తాజాగా ఆ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు, నేడు ఒకటో తారీకు కావడంతో జీతాలు, పెన్షన్ల ప్రాసెసింగ్ వ్యవహారంపై సందిగ్ధత ఏర్పడింది. పాత జీతం కావాలని ఉద్యోగులు పట్టుబడుతుంటే…కొత్త జీవోల ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం అంటోంది. దీంతోపాటుగా, వృద్ధాప్య పెన్షన్లు కూడా విడుదల కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ట్రెజరీ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతోనే సీఎంఎఫ్ఎస్ స్తంభించిందని, అందుకే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా..ఈ సమస్యకు ప్రభుత్వం సత్వర పరిష్కారం కనుగొనకుంటే…ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా… పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో…జగన్ కు షాక్ తగిలినట్లయింది.