వైసీపీ అగ్రనాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డికి ఘోర అవమానం జరిగింది. తాజాగా విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో వైవీని వ్యతిరేకిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం.. నినాదాలు చేసింది. ఆయన ముందే.. డౌన్ డౌన్ నినాదాలు చేసింది. దీంతో వైవీ వారికి సర్ది చెప్పలేక.. అర్ధంతరంగా సభ నుంచి బయటకు వచ్చేశారు. ఈ పరిణామంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నాయకులు కూడా ఇబ్బందిపడ్డారు.
ఏం జరిగిందంటే..
గాజువాక నియోజకవర్గం టికెట్‌ను ఈ దఫా వైసీపీ వేరేవారికి ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 2019 ఎన్నికల్లో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పదవిని ఆశించారు. అది దక్కలేదు. పోనీ.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. దీనిపైనా నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన పార్టీ.. ఇప్పుడు ఏకంగా ఆయనను తప్పించేసింది. ఈయన స్థానంలో ఊరుకూటి రామచంద్రరావును అభ్యర్థిగా ప్రకటించింది. ఇది రాజకీయ కాకకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పర్యటించారు. విశాఖలో సమావేశం నిర్వహించారు. అటు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని, ఇటు వైసీపీ కొత్త అభ్యర్థి, ఇంచార్జ్ ఉరుకూటి రామచంద్రరావును కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారిద్దరూ కూడా తమ అనుచరులతో ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలను ఉద్దేశించి వైవీ ప్రసంగించారు. కొత్త అభ్యర్థి ఊరుకూటి రామచంద్రరావుకు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయన వైపే ఉందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
దీంతో ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. నాగిరెడ్డికే టికెట్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని కార్యకర్తలు ఘెరావ్ చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ఆయనకు ఎందుకు మొండి చేయి చూపారని నిలదీశారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామన్నారు.
లేదంటే సహకరించబోమని నినాదాలతో హోరెత్తించారు. దీంతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ బీసీకి సీటు కేటాయించారని సుబ్బారెడ్డి తెలిపారు. అయినప్పటికీ కార్యకర్తలు శాంతించకపోవడం, డౌన్ డౌన్ వైవీ నినాదాలతో హోరెత్తించడంతో వైవీ అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించారు.