ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి మరెంతో అట్టహాసంగా ప్రారంభించిన సెక్రటేరియట్ కార్యక్రమంలో ప్రతిపక్షాలు ఎక్కడా కనబడలేదు. ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతనిదులు ఎవరు కార్యక్రమంలో లేరు. అంటే ప్రతిపక్షాలు లేకుండానే కేసీయార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ప్రతిపక్షాలు రావాలని కేసీయార్ పెద్దగా అనుకున్నట్లు లేదు. అందుకనే వాళ్ళకి ఆహ్వానాలు పంపాల్సిన పద్దతిలో పంపకుండా అవమానించారట. కారణం ఏమిటంటే సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తమ పార్టీ లేదా ఇంటి కార్యక్రమంగా భావించటమే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష పార్టీల అధినేతలకు స్వయంగా కేసీయార్ ఫోన్లో ఆహ్వానించి ఉంటే బాగుండేది. లేదా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా పంపుంటే మర్యాదగా ఉండేది. కనీసం ప్రోటోకాల్ ప్రకారమే జీయేడి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడించి ఆహ్వనాన్ని పంపుండాల్సింది. ఇవేవీ కాదనుకుంటే మంత్రులను ప్రతిపక్ష నేతల దగ్గరకు పంపి ఆహ్వానాలు అందించుండాలి. ప్రతిపక్షాల నేతలను ఆహ్వానించేందుకు ఇన్నిమార్గాలుండగా కేసీయార్ దేన్నీ ఫాలో అవ్వలేదు.
చాలా సింపుల్ గా జాయింట్ కలెక్టర్ల స్ధాయి అధికారులకు ఆహ్వానాలు అందించి తీసుకెళ్ళి ఇచ్చేయమన్నారు. అందుకనే దీన్ని అవమానంగా భావించిన ప్రతిపక్షాల అధినేతలు, ఎంఎల్ఏలు, ఎంపీలు కూడా ఎవరు హాజరుకాలేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కార్యక్రమంలో ప్రతిపక్షాల నేతలు లేరంటే అది తనకే అవమానం అని కేసీయార్ మరచిపోయినట్లున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్షాలను కూడా భాగస్వామ్యం చేసినపుడే నిండుతనం వస్తుంది.
అలాకాకుండా సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని తన సొంత కార్యక్రమంగా భావించారు కాబట్టే ప్రోటోకాల్ మర్యాదలను పాటించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించేసిన తర్వాత ఇపుడు ఎన్ని సమర్ధింపులు చేసుకున్నా ఉపయోగముండదు. ప్రతిపక్షాల నేతలు హాజరవ్వాల్సిన అవసరంలేదని కేసీయార్ అనుకున్నట్లున్నారు. అందుకనే తన ఆలోచనల ప్రకారమే ఉన్నతాధికారులు నడుచుకున్నారు. ఇందుకనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. ఇదే పద్దతిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మండిపడ్డారు.