సీఎం వైఎస్ జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి నుంచి తనను తప్పించడంతో జగన్ పై బాలినేని గుర్రుగా ఉన్నారని టాక్ వచ్చింది. అప్పటి నుంచి బాలినేని చురుగ్గా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత తనపై సొంత పార్టీ నేతలే కుట్రలకు పాల్పడుతున్నారని బాలినేని షాకింగ్ ఆరోపణలు చేశారు.
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, వారెవరో తనకు తెలుసని…వాళ్ల సంగతి చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం జరుగుతోందని, వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా బాలినేనికి జగన్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి ఊతమిచ్చేలా బాలినేనికి ఘోర అవమానం జరిగింది.
సీఎం జగన్ మార్కాపురం పర్యటనలో బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకోవడం షాకింగ్ గా మారింది. తనను అడ్డుకున్న పోలీసులపై ఫైర్ అయిన బాలినేని.. ఆ తర్వాత అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆయన ఒంగోలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బాలినేనికి మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, సహచర నేతలు నచ్చజెప్పినా ఆయన వినలేదని తెలుస్తోంది.
ప్రొటోకాల్ లో బాలినేనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అలకబూనారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని పోలీసులు, భద్రతా సిబ్బంది సూచించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని.