టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చంద్ర శేఖర్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారేమిటి అని చాలామంది అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది.
చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు మహేశ్ కుమార్ గౌడ్ ఇష్టపడలేదని, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా చంద్రశేఖర్ రెడ్డితో రెండు నిమిషాలు అంటిముట్టనట్లు మాట్లాడడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన సమయంలో తాను మీటింగ్ లో ఉన్నానని, అందుకే దీపా దాస్ మున్షిని ఆయన కలిశారని చెప్పారు.
ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పానని అన్నారు. దీపాదాస్ మున్షీతో చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పరిచయం లేదని, అందుకే త్వరగా మాట్లాడి వెళ్లిపోయారని చెప్పారు. ఏది ఏమైనా…అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ నేతలు గరంగరంగా ఉన్నారని, అందుకే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.