నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. మాటల చాతుర్యం అన్ని సార్లు పనిచేయకపోవచ్చు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చే వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే. అయితే.. చంద్రబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నది జ్యూడీషియల్ రిమాండ్ లో తప్పించి.. నేరం నిరూపితమై.. శిక్ష అనుభవించట్లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఖైదీల్లో ఒకరు చంద్రబాబు. ఆయనేం ప్రత్యేకం కాదంటూ మాట్లాడుతున్న మాటలు పైశాచిక ఆనందమే తప్పించి.. మరొకటి కాదనే చెప్పాలి. ఎందుకంటే.. జైల్లో పలువురు ఖైదీలు ఉంటారు. కరుడుగట్టిన ఖైదీలు ఉంటారు. హత్యలు.. మానభంగాలు మాదిరి దారుణ నేరాలు చేసినోళ్లు ఉంటారు. ఉగ్రవాదులు.. తీవ్రవాదులు ఉంటారు. అందరూ ఒకటే లాంటి వ్యాఖ్యలు రాజకీయ వైరంతో చేసేవే తప్పించి.. అందులో ఏ మాత్రం లాజక్కు లేదన్నది మర్చిపోకూడదు.
తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీల విషయంలో జైలు అధికారులు ఏ రీతిలో వ్యవహరిస్తారో.. ఒక పెట్టీ కేసులో అరెస్టు అయి జైలుకు వచ్చిన ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారో అందరికి తెలియదా? ఇలాంటప్పుడు ముఖ్యమంత్రిగా దాదాపు పద్నాలుగేళ్లకు పైనే పదవిలో ఉన్న ఒక రాజకీయ ప్రముఖుడు.. కొన్ని ఆరోపణల మీద రిమాండ్ కు వెళితే.. జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలతో చంద్రబాబును పోల్చటంలో అర్థం లేదు.
జైల్లోని ఖైదీలతో చంద్రబాబును పోల్చటం చూస్తే.. ఇంతకు మించిన దిగజారుడతనం కనిపించదు. సాధారణంగా జైల్లో సాధారణ ఖైదీలకు.. కరుడు గట్టిన ఖైదీలకు.. ప్రముఖులకు.. సెలబ్రిటీలు కాస్తా ఖైదీలుగా మారినప్పుడు.. వారికి అవసరమైన కొన్ని సౌకర్యాల్ని జైలు మాన్యువలే కల్పిస్తుంది. అంటే.. ఖైదీలంతా ఒక్కటే కాదు. అందులోనూ విభాగాలు ఉంటాయన్న విషయం కనిపిస్తుంది. అలాంటప్పుడు చంద్రబాబు మిగిలిన ఖైదీల్లో ఒకరేనని.. ఆయనేం ప్రత్యేకం కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సబబుగా అనిపించేవి కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.