మా పిల్లలు బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని కోరుకుంటారు, 99% తల్లిదండ్రులు. ఉద్యోగం అంటే..ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే, ఉద్యోగాలుగా పరిగణించబడ్డాయి. కానీ,1970 వ దశకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణ ప్రారంభమైన తర్వాత..ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో లేదా కార్పొరేట్ రంగంలో కోట్లాది ఉద్యోగావకాశాలను ప్రైవేటు పరిశ్రమలు కల్పించాయి.
1947లో భారత దేశానికి స్వాతంత్రం రావడం కేవలం రాజకీయ పరమైన అంశం. కానీ స్వతంత్ర భారత ఆర్థికాభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైంది 1948లో. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారత ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గా ప్రకటించింది. కానీ ఆర్థిక అసమానతలను నివారించాలనే లక్ష్యంతో, ప్రైవేట్ రంగాన్ని అంటే ఆచరణలో ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు యాజమాన్యాన్ని నియంత్రించే విధానాలను అమలు చేయడం వల్ల,1991 వరకు భారత దేశ ఆర్థిక వ్యవస్థ నియంత్రిత ఆర్థిక వ్యవస్థగాపని చేసింది.
ఫలితంగా దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రభుత్వ రంగ నాయకత్వంలో జరిగి, ప్రైవేటు రంగాన్ని చిన్న తరహా పరిశ్రమలకు, లఘు పరిశ్రమలకు పరిమితం చేయడం జరిగింది. ఈ నియంత్రిత ఆర్థిక విధానం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ రంగం లో ఉన్న పెట్టుబడులను ఉపయోగించుకోలేక పోవడం వలన, ఆర్థికాభివృద్ధిలో వేగం లోపించింది. పేదరిక నిర్మూలనలో లక్ష్యాలను సాధించలేక పోయాం.
ఈ నేపథ్యంలో 1991 లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను, గుర్తించి, అంగీకరించి, భారత దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో అనుసంధానం చేసే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను భారత దేశ ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించే లక్ష్యంతో,
భారత దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని సవరించి, నియంత్రిత ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఆర్థిక సంస్కరణల పేరుతో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ- ప్రారంభించబడ్డాయి.
1991 ముందు మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగంలో పరిశ్రమల స్థాపన అంటే ఒక పెద్ద సాహసం అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం అభివృద్ధి అంతంత మాత్రమే. ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం చాలా పరిమితంగా ఉండేది. ప్రైవేటు సంస్థల దగ్గర, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకునే రుణాలకు వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండేది. పరిశ్రమలు స్థాపించాలనుకున్న ప్రాంతంలో రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, నైపుణ్యం ఉన్న మానవ వనరులు..చాలా పరిమితంగా ఉండేవి.
అభివృద్ధి చెందిన దేశాలలో శాంతిభద్రతల నిర్వహణ తో పాటు మౌలిక వసతుల కల్పన ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన వనరుల కొరత కారణంగా మౌలిక సదుపాయాలు నామమాత్రంగా ఉండేవి. అన్నిటికీ మించి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో లంచం కోసం పీడించే అధికారుల వేధింపులు అదనంగా ఉండేవి.
ఈ నేపథ్యంలో, ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనో, సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనో..ఎన్నో వేలమంది..ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తమ చదువు కి, తమ నాలెడ్జ్ కి, తమ అనుభవానికి, అందుబాటులో ఉన్న పెట్టుబడికి అనుగుణంగా, కొన్నివేల నిద్రలేని రాత్రులు గడిపి, కుటుంబాన్ని వదిలేసి, స్నేహితుల్ని వదిలేసి, ఫంక్షన్లు, పార్టీలు వదిలేసి, లంచ్ టైం కి టిఫిన్ చేసి, డిన్నర్ టైం కి లంచ్ చేసి, కష్టాల్లో నిలదొక్కుకొని, నష్టాలను భరించి, ఆస్తులు అమ్ముకొని, భార్య బంగారం అమ్ముకొని, కన్నీళ్లను తుడుచుకొని, నమ్మిన వాళ్లు వెన్నుపోటు పొడిచినా, చుట్టూ ఉన్న వాళ్ళు నిరాశపరిచినా, వెనకడుగు వేయకుండా, సంవత్సరాల తరబడి, కన్నబిడ్డల్లా కాచి కాపాడుకుంటూ, వాళ్ళ పరిశ్రమలను నిలబెట్టారు. కోట్లాది మంది జీవితాలను నిలబెట్టారు.
బాగా డబ్బు సంపాదించిన వారి గురించి మెజారిటీ ప్రజలు చెడు ఎక్కువగా మాట్లాడుకుంటారు. దానికి కారణం కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కాదు. మనుషుల్లో ఉండే అసూయ, ఎదుటి వాళ్ళు ఎదిగితే మనస్ఫూర్తిగా చూడలేని మానసిక వైకల్యం. ఇది చరిత్ర పొడవునా ఉంది.
దేశీయంగా టాటాలు, బిర్లాలు, అంబానీలు, అంతర్జాతీయంగా ఫోర్డ్ లాంటి ఎందరో ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించే ముందు, సాధారణ జీవితాన్ని, పేదరికాన్ని చూసినవాళ్లే. ఇప్పుడు ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన ఇళ్లు చూసేవాళ్ళకి, వాళ్ల నాన్న ధీరుబాయ్ అంబానీ అహ్మదాబాద్ లో వస్త్రాల మిల్లు దగ్గర నూలు కండెలు అమ్మిన విషయం, ఒమన్ లో పెట్రోల్ బంక్ లో పని చేసిన విషయం తెలియకపోవచ్చు. ఎంత ఎదిగినా, పునాదులు ఉండేది మట్టిలోనే.
పెట్టుబడిదారులు అందరూ, పారిశ్రామికవేత్తలు అందరూ మంచి వాళ్ళు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. టాటాలు, బిర్లాలు కొన్ని దశాబ్దాల కాలంలో చట్టబద్ధంగా, కొన్ని నైతిక విలువలు పాటిస్తూ సంపాదించిన దానికంటే, అనేక రెట్ల సంపదను, చట్టంలోని లొసుగులను, అవినీతి నాయకులను, అధికారులను ఉపయోగించుకుని అంబానీలు సంపాదించారు.
ఇలా కొంత మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పరిశ్రమలు స్థాపించి, నడుపుతున్న ఫలితంగా, ఈరోజు కోట్లాదిమంది యువతీ యువకులు, వాళ్ల తల్లిదండ్రులు ఊహించనంత జీతంతో, అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఉద్యోగాలు చేస్తూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఈ పారిశ్రామికవేత్తల కృషి ఫలితంగా వెనుకబడిన ప్రాంతాలు, పారిశ్రామిక నగరాలుగా రూపాంతరం చెంది, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు తెచ్చాయి. ఈ పరిశ్రమల అభివృద్ధితో ఆ ప్రాంతాల్లో రోడ్లు వచ్చాయి, విద్యుత్ వచ్చింది, నీటి సరఫరా వచ్చింది. ఫలితంగా ఆ ప్రాంత స్వరూపమే మారిపోతుంది. భూముల ధరలు పెరుగుతాయి, అనుబంధ వ్యాపారాలు పెరుగుతాయి, ప్రజల ఆదాయం పెరుగుతుంది, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. క్రమంగా ఆ ప్రాంత ముఖ చిత్రమే మారిపోతుంది. లేకపోతే సాక్చి అనే కుగ్రామం జంషెడ్పూర్ అయ్యేదికాదు, రాళ్లు, రప్పల అనాజ్ పూర్ రామోజీ ఫిలిం సిటీ అయ్యేది కాదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా సంస్థ తమిళనాడుకు తరలిపోతుంది..అని వార్త చూసి..నిర్గాంతపోయి..అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఆలోచిస్తుంటే, రెండేళ్లుగా జరుగుతున్న రాష్ట్ర విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే..అభివృద్ధి చెందిన అమెరికా లో అన్ని సౌకర్యాలు ఉన్న జీవితాన్ని వదిలేసి.. గల్లా రామచంద్ర నాయుడు, 36 సంవత్సరాల క్రితం, తన సొంత ప్రాంతాన్ని, సొంత సమాజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో-తన అత్తగారైన అమరావతి పేరులో..అమర..తన మామ గారైన రాజగోపాల్ నాయుడు పేరులో ‘రాజా’ కలిపి ‘అమరరాజా’ పేరుతో ప్రారంభించిన ఒక పరిశ్రమ, ప్రస్తుతం 15216 మందికి ప్రత్యక్షంగా, ఎన్నో వేల మందికి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్న ఒక పరిశ్రమ..
రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 1200 కోట్లు పన్ను చెల్లిస్తున్న పరిశ్రమ ఇలా వార్తల్లో ఉండటం చూసి…
కన్నీళ్ల తో
డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు