ప్రపంచంలో కొన్ని ఉదంతాలు చాలా ఆశ్చర్యానికి.. అంతకు మించిన విస్మయానికి గురి చేస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఒకరికి ఒక పెళ్లితోనే జీవితం అయిపోతుంది. ఒకరికి ఆ కంఫర్టు లేకపోతే.. మరో పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడుతుంటారు. గడిచిన పదేళ్లలో ఈ ట్రెండ్ వైరల్ అయింది. ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే విడాకులకు వెనుకా ముందు ఆలోచించకుండా ఉండేవారు. ఇప్పుడు సామాన్యులు సైతం.. ఆ దారిలోకే వచ్చేశారు. జీవిత భాగస్వామితో సరిపోదనుకుంటే.. నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. రిలేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అభిప్రాయానికి విలువనిచ్చి వారికి అండగా నిలుస్తున్నారు. ఇలా సాదాసీదా జీవితాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక ఉదంతం గురించి తెలిస్తే.. నోరెళ్లబెట్టకుండా ఉండలేం. ఇండోనేషియాకు చెందిన కాన్ అనే వ్యక్తికి అక్షరాల 61 ఏళ్లు. అతడి స్పెషల్ ఏమంటే.. అతనెప్పుడు పెళ్లి చేసుకుంటాడో.. ఎప్పుడు విడిపోతాడో అర్థం కానట్లుగా ఉంటుంది అతడి రిలేషన్ల చిట్టాను చూస్తే. అరవైఒక్క ఏళ్ల వయసు నాటికి అతగాడు 87 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆ బంధానికి గుడ్ బై చెప్పేసి.. మరో పెళ్లికి రెఢీ అవుతున్నాడు. అతగాడి మొదటి పెళ్లి.. అతను పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది.
తనకంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకు అతగాడి ప్రవర్తన నచ్చక అతడికి దూరంగా ఉండసాగింది. ఆ తర్వాత అతను మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను పెళ్లి చేసుకోవటం.. ఆ అమ్మాయిలో ఏదో ఒకటి నచ్చకపోవటమో.. ఇతగాడు నచ్చకపోవటమో జరిగేది. ఇలా చూస్తుండగానే అతడు పెళ్లి చేసుకోవటం.. విడిపోవటం అన్నది చాలా సాధారణ అంశంగా మారింది. ప్రస్తుతం 87వ భార్యతో విడిపోయిన అతను.. ఇప్పుడు 88వ పెళ్లికి రెఢీ అయ్యాడు. ఈ పెళ్లి స్పెషల్ ఏమంటే.. అతను చేసుకోబోతున్న అమ్మాయి మరెవరోకాదు.. అతని 86వ భార్యే కావటం. మొత్తానికి అతగాడి భార్యల లెక్క ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో అర్థం కానిదిగా మారింది.