ఎన్నికల సర్వేలు టీడీపీలో జోష్ పెంచుతున్నాయి. తాజాగా ఇండియా టుడే-సీఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి.
ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి మరింత పికప్ అయిపోతామంటూ వారు ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నారు.
ఏపీలో గాలి టీడీపీ వైపు మళ్లిందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్తున్నారు.
ఇండియాటుడే-సీఓటర్ తాజా సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 15 సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని తేలింది.
ఇదేమీ చిన్న లెక్క కాదు. ఎన్నికలకు ఇంకా ఆర్నెళ్ల కంటే ఎక్కువ టైం ఉండగానే సగం కంటే ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయని తేలింది.
గత ఎన్నికలలో కేవలం 3 సీట్లే గెలుచుకోగా ఇప్పుడు అదనంగా మరో 12 గెలుస్తారని ఈ సర్వే చెప్పింది.
కాగా వైనాటా 175 అంటూ ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీకి ఈ సర్వే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు చేసింది.
అందుకు కారణం లేకపోలేదు. 15 లోక్ సభ సీట్లు టీడీపీ గెలుస్తుందంటే.. ఆ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలలో గరిష్ఠంగా టీడీపీయే గెలుచుకుంటుందన్నది సాధారణ లెక్క.
15 ఎంపీ స్థానాల పరిథిలో 105 ఎమ్మెల్యే సీట్లున్నాయి. ఈ 105 ఎమ్మెల్యే సీట్లలో 89 సీట్లలో టీడీపీ పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు సర్వేలో తేలిందని ఆ సర్వేలో భాగమైన కీలక వ్యక్తులు చెప్తున్నారు.
అయితే.. పార్లమెంటు స్థానాల ఫలితాలు మాత్రమే ఈ సర్వే వెల్లడించడంతో ఎమ్మెల్యే సీట్ల లెక్క బయటకు రాలేదు.
దీంతో ఈ 89తో పాటు మిగతా 10 లోక్ సభ సీట్లు పరిధిలో గెలవబోయే ఎమ్మెల్యే సీట్లతో కలిపి టీడీపీ బ్రహ్మాండమైన విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ లెక్క ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి కనీసం 110 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఎన్నికలు జరిగే నాటికి మరిన్ని సీట్లు టీడీపీ ఖాతాలోకి వచ్చి చేరుతాయన్నది అంచనా.