సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఒక వ్యక్తి గురించి మీడియా సంస్థలన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాయి. ఆయనే దేశ ప్రధమ ఓటరు శ్యామ్ శరణ్ నేగీ. 106 ఏళ్ల వయసున్న ఆయన శనివారం కన్నుమూశారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న తన నివాసంలోనే ఆయన కన్నుమూశారు.
ఇంత పెద్దవయసులోనూ ఎన్నికల పోలింగ్ కు మాత్రం తప్పనిసరిగా హాజరయ్యేవారు.
ఆయన ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేది.
ఆయన కూడా తన జీవితంలో అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఓటు వేసే విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించలేదు.
నిజానికి ఆయన గురించి దేశ ప్రజలు బాగా తెలుసుకున్నది మాత్రం యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాట్సాప్ ను బాగా వాడటం మొదలు పెట్టిన సందర్భంలోనే. ఓటుహక్కను నిర్వహించుకునే విషయంలో ఆయన్ను స్పూర్తిగా చూపిస్తుంటారు.
అంత పెద్ద వయసులోనే ఓటు వేసేందుకుఆయన ఇచ్చే ప్రాధాన్యత.. ఆరోగ్య సమస్యల్ని పక్కన పెట్టి.. ఓటు వేయటానికి ఆయన ఎదుర్కొనే కష్టం చూసినోళ్లు.. ఓటు విలువ ఏమిటన్నది ఆయన జీవన విధానం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో నివాసం ఉంటున్నారు.
ఆయన తన జీవితంలో చివరిసారిగా ఓటు వేసింది.. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ నెల రెండో తేదీన తన ఇంట్లోనే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటు వేశారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త ఓటింగ్ విధానం (పెద్ద వయస్కులు ఇంట్లో నుంచి రాకుండా.. పోలింగ్ సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ ఓటు వేయించే సౌకర్యం) ప్రవేశ పెట్టారు.
ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఉన్న నేగీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మండీ జిల్లా సుందర్ నగర్ ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో నేగీ అనురక్తి గురించి.. ప్రజాస్వామ్యంపై ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం.
తన జీవితకాలంలో ఆయన 34 సార్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని.. మరణించే మూడురోజుల ముందు కూడా ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
నేగీ మరణం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు చేరుకొని దేశ తొలి ఓటరుకు ఘనంగా నివాళులు అర్పించారు.
నేగీ మరణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు.. మిగిలిన రాజకీయ పార్టీలు తమ సంతాపాన్ని తెలియజేశారు.
దేశ మొదటి ఓటరుగా సుపరిచితులైన నేగీ.. ఇప్పుడు గతం కానున్నారు.
సాంకేతికంగా ఇప్పుడు మరో వ్యక్తి దేశ తొలి ఓటరు కావొచ్చు.
కానీ.. నేగీ లోటును మాత్రం మరెవరూ తీర్చలేరన్నది మాత్రం నిజం.