అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాయేతరులపై జాత్యాహంకార దాడుల సంఖ్య పెరిగిపోవడం భారత సంతతి అమెరికన్లను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన క్యాథలిక్ మత ప్రచారకుడు అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 4) నాడు కాన్సాస్ రాష్ట్రంలోని సెనెకాలో ఫాదర్ అరుల్ కరసాలపై గ్యారీ(66) అనే వ్యక్తి కాల్పులు జరపడంతో అరుల్ కరసాల అక్కడికక్కడే మృతి చెందారు.
నిందితుడు గ్యారీని పోలీసులు అదుపులోకి తీసుకొని అతడిపై ఫస్ట్ డిగ్రీ హత్యా నేరం మోపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాన్సాస్ లోని ఆర్చ్ డయోసెస్ లో ఫాదర్ గా 20 ఏళ్లకు పైగా అరుల్ కరసాల సేవలందించారు. 2011 నుంచి సెనెకాలోని సెయింట్స్ పీటర్, పాల్ పెరిష్ నాయకుడిగా ఉన్న అరుల్ కరసాలకు కాన్సాస్ లో మంచి గుర్తింపు ఉంది. అరుల్ కరసాల హత్యను కాన్సాస్‌లోని కాన్సాస్ నగర ఆర్చ్ డయోసెస్ ఆర్చ్ బిషప్ జోసెఫ్ నౌమాన్ ధృవీకరించారు. అరుల్ కరసాల హత్యను అనాలోచితపు హింసాత్మక చర్యగా అభివర్ణించారు.
అరుల్ కరసాల హత్య ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అరుల్ కరసాల సేవలు చిరస్మరణీయమని, ఆయన అనుచరులకు ఆయన లేని లోటు పూడ్చలేనిదని కొనియాడారు. నెమెహా మార్షల్ రీజియన్ డీన్ గా కూడా అరుల్ కరసాల సేవలందించారని గుర్తు చేసుకున్నారు. అరుల్ కరసాల గౌరవార్థం గురువారం రాత్రి కొలంబస్ కు చెందిన లోకల్ నైట్స్ రోజరీ సర్వీస్ నిర్వహించారు. నెమెహా బిషప్ గా అరుల్ కరసాల గుర్తింపు పొందారు.
అరుల్ కరసాల హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కాన్సాస్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ డ్యాన్ హాకిన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం వినగానే తన గుండె బద్దలైందని చెప్పారు. కరసాల ఆత్మకు శాంతి కలగాలని, ఆయన సన్నిహితులకు, స్నేహితులకు ఆ పరమాత్మ మనోధైర్యాన్నివ్వాలని హాకిన్స్ ప్రార్థించారు. అరుల్ కరసాల మృతికి యూఎస్ సెనేటర్ రోజర్ మార్షల్ సంతాపం వ్యక్తం చేశారు. కరసాల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కరసాలను చంపిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని కోరారు.