ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశానికి పట్టుకొమ్మల వంటి సంస్థలన్నీ అమ్మకానికి పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జియోకు పరోక్షంగా మద్దతిచ్చి బీఎస్ఎన్ఎల్ ను బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని విపక్షాలు ఆరోపించాయి. ఆ తర్వాత ఎయిరిండియా విక్రయం…ఎల్ ఐసీలో వాటాల విక్రయం….ప్రైవేటు రైళ్లకు అనుమతులు….ఇలా కీలక రంగాలను మోడీ సర్కార్ అమ్మకానికి పెడుతోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, దేశాభివృద్ధి కోసమే తాము ఈ చర్యలు చేపడుతున్నామని మోడీ సర్కార్ సమర్థించుకుంటోంది. ఈ నేపథ్యంలో విపక్షాల విమర్శలను లెక్క చేయని మోడీ సర్కార్ తాజాగా మరో అమ్మకానికి రెడీ అయింది. ఐఆర్ సీటీసీలో తన వాటాను విక్రయించడం ద్వారా రూ.4200 కోట్లు అర్జించాలని మోడీ మరో మంచి చౌక బేరానికి తెర తీశారని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇప్పటికే పలు రంగాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోన్న కేంద్రం….తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వేలో సేవల వినియోగానికి నిర్దేశించిన ఐఆర్సీటీసీలో తన వాటాను అమ్మకానికి పెట్టడం ద్వారా రూ.4,200 కోట్ల రూపాయలను పొందాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి 87.4 శాతం వాటా ఉంది. తనకున్న 3.2 కోట్ల షేర్లను కేంద్రం అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది. ఒక్క షేర్ ధర మార్కెట్లో రూ.1,618 ఉంది. అయితే, మోడీ సర్కార్ ఒక్కో షేర్ ను రూ.1,367కే కారు చౌకగా అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే, మొత్తం 3.2 కోట్ల షేర్లలో కేవలం 2.4 కోట్ల షేర్లనే ముందుగా అమ్మకానికి పెట్టింది. షేర్ల కొనుగోలులో ముందుగా నాన్ రిటైలర్లకు చాన్స్ ఇచ్చింది కేంద్రం. డిసెంబర్ 11 నుంచి అందరికి అవకాశం కల్పించనుంది.