ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సులు కొట్టడం అనేది ఓ రికార్డు. ఒకే ఓవర్లోని అన్ని బంతులను సిక్సర్లుగా మలచడం మామూలు విషయం కాదు. ఆ బౌలర్ ను ‘ఆరేసి’న బ్యాట్స్ మన్ కు అది కెరీర్ లో మరపురాని ఘట్టం అయితే…ఆ ఆరు బంతులు విసిరిన బౌలర్ కు మాత్రం అదో మరచిపోలేని పీడకల. ఇలా ఒకే ఓవర్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ హర్షలీ గిబ్స్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నారు.
మొదట యువరాజ్ ఈ ఫీట్ సాధించినపుడు మరో బ్యాట్స్ మన్ కు ఇది సాధ్యమా అని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ, గిబ్స్, పొలార్డ్ లు అది సాధ్యమే అని నిరూపించారు. దీంతో, ఈ ముగ్గురి తర్వాత కూడా మరి కొందరు బ్యాట్స్ మన్లు ఈ ఘనత సాధించే అవకాశముందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి అంతకు మించిన రికార్డు నెలకొల్పడం సాధ్యమే అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అది సాధ్యమేనని తన బ్యాట్ తో సమాధానమిచ్చాడు టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్ మన్ గా గైక్వాడ్ చరిత్ర పుటలకెక్కాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి ఎవరూ ఏ బ్యాట్స్ మన్ సాధించని అరుదైన ఘనతను భారతీయ బ్యాట్స్ మెన్ సాధించడం విశేషం. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది. మహారాష్ట్ర ఓపెనర్ గా, ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు.
159 బంతుల్లో 220 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్ సింగ్ బౌలింగ్ లో రుతు రాజ్ 7 భారీ సిక్సులు కొట్టాడు. ఇన్నింగ్స్ 49వ ఓవర్ లో ఐదో బంతి నోబాల్ గా పడటంతో… శివ్ సింగ్ అదనంగా మరో బంతిని వేయాల్సి వచ్చింది. ఆ బంతిని కూడా గైక్వాడ్ బౌండరీ దాటించడంతో కొత్త చరిత్ర లిఖించాడు. దీంతో, ప్రపంచ క్రికెట్లో ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. దీంతో, రుతురాజ్ 7 సిక్సర్ల వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! ????????
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022