పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ -2023 లో భారత్ తన అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో బలమైన న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో చిత్తు చేసి నాలుగో సారి ప్రపంచ కప్ ఫైనల్ లో అడుగుపెట్టి కప్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ జట్టు 327 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ షమీ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
అంతకుముందు, నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్(47), గిల్(80) పరుగులతో రాణించగా శ్రేయాస్ అయ్యర్, కోహ్లీలు సెంచరీలు సాధించారు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 50 వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా వన్డే క్రికెట్ లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ సొంత గ్రౌండ్ లో ఆయన ముందే ఈ రికార్డును కోహ్లీ చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా కోహ్లీకి భారత ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సచిన్, గంగూలీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్ మన్ డెరైల్ మిచెల్ (134) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ విలియమ్సన్(69) తో కలిసి 181 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ జోడీని షమీ ఔట్ చేయడంతో భారత్ విజయం దిశగా అడుగులు వేసింది. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లను కూడా షమీ ఔట్ చేయడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
క్రికెట్ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా షమీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున ప్రపంచ కప్ లోని ఒక మ్యాచ్ లో, వన్డే క్రికెట్ లోని ఓ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా షమీ(7/57) నిలిచాడు. కివీస్ పై విజయంతో భారత్ నాలుగోసారి వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. 1983, 2011లో విజయం సాధించి కప్ సొంతం చేసుకోగా 2003 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న రెండో సెమీస్ లో విజయం సాధించిన జట్టు ఈ నెల 19న జరిగే ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.