అంతర్జాతీయ క్రికెట్లోకి టీ20 ఫార్మాట్ అడుగుపెట్టిన తర్వాత టెస్టు క్రికెట్ కు ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటు ఆటగాళ్లతోపాటు అటు వీక్షకుల సహనాన్న టెస్ట్ చేసే టెస్ట్ క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక క్రికెటర్ అసలు సత్తా ఏమిటో తెలియాలంటే టెస్టు క్రికెట్ లో అతడి ఆటతీరే కొలమానం అని క్రికెట్ పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే వన్నె తగ్గుతోన్న టెస్టు క్రికెట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఐసీసీ ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగానే నిర్ణీత కాలంలో టెస్టు క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్, న్యూజిలాండ్ ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆటగాళ్లతోపాటు వీక్షకుల, టీవీ ప్రేక్షకుల సహనాన్ని మరోసారి పరీక్షిస్తోంది. ఈ మ్యాచ్ కు వరుణుడు వరుసగా అడ్డుతగులుండడంతో ఈ వేదికపై మ్యాచ్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ దాదాపుగా వర్షార్పణం అయ్యే పరిస్థితి ఉండడంతో ఫైనల్ వేదికపై ఐసీసీ మరింత కసరత్తు చేసి ఉండాల్సిందని క్రీడా పండితులు విమర్శిస్తున్నారు.
పోటాపోటీగా ఫైనల్ దాకా వచ్చిన మ్యాచ్ ను చూసేందుక వస్తే…తీరా అది వర్షార్పణం అయ్యి డ్రాగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఒక వేళ ఈ మ్యాచ్ డ్రా అయితే విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక విధానాన్ని కనుగొనాలని టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫుట్ బాల్, టెన్నిస్ లో డ్రా అయితే విజేతను నిర్ణయించే పద్ధతుల తరహాలో క్రికెట్ లోనూ ఏదో విధానం కనుగొనాలని అన్నాడు.
ఆసక్తికరంగా సాగుతున్న ఈ మ్యాచ్లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగించడం బాధాకరమని, 4 రోజుల ఆటలో 2 రోజులకు పైగా నిలిచిపోయిందని నిరాశపడ్డారు. ఈ మ్యాచ్ తర్వాత మూడు, నాలుగు రోజుల వ్యవధిలో ఇంకో టెస్టు మ్యాచ్ను నిర్వహించాలని దాన్ని ఫైనల్గా పరిగణించాలని చెప్పాడు. డ్రా అయితే ఇరు జట్లూ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉందని, ఐసీసీ ఫైనల్స్లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి అయ్యే అవకాశముందని అన్నారు.