కాసు మహేష్‌రెడ్డి.. వైసీపీలో కీలక నాయకుడు. ఉన్నత విద్యావంతుడు.. రాజకీయంగా కూడా బలమైన కుటుంబం నుంచి వచ్చిన నేత. ప్రస్తుతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పైగా సీఎం జగన్‌కు ఎంతో ఆత్మీయుడు. ఇది.. పైకి కనిపించే ప్రొఫైల్. కానీ, నియోజకవర్గం లోని వైసీపీ నాయకులను పలకరిస్తే మాత్రం.. `కాసు కాదు.. తిరకాసు!` అనే మాటే వినిపిస్తోంది. మరి దీనికి కారణాలేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని టీడీపీకి బలమైన కంచుకోట వంటి గురజాల నియోజకవర్గం నుంచి కాసు మహేష్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. దాదాపు 28 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. మరి తొలిసారి అరంగేట్రం చేసిన కాసుకు.. ఈ రేంజ్లో బలమైన మెజారిటీ రావడం వెనుక.. అనేక మంది కృషి చేశారు. అంతేకాదు.. సీటును త్యాగం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ, ఈ నాలుగేళ్లలో కాసు వారిని దూరం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
తన ఒంటెత్తు పోకడలు, పార్టీలో తనకు సహకరించిన వారిని పక్కన పెట్టడం, సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. వారిపైనే కేసులు పెట్టించడం వంటివి పరిపాటిగా మారింది. ఇక, గ్రామీణ స్థాయిలో గత టీడీపీ ప్రభు త్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, నిర్మాణాలు వంటివే కనిపిస్తున్నాయి. ఇది.. కాసును ప్రజలకు దూరం చేసే పరిణామంగా స్థానిక నేతలు చెబుతున్నారు. పోనీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అంటే.. అది కూడా లేదని వగరుస్తున్నారు.
నెలకు కాదు.. ఆరు మాసాలకు ఒక్కసారి మాత్రమే ఆయన ప్రజలకు కనిపిస్తున్నారని.. కనీసం ఆయన సమస్యలు పట్టించుకునే తీరిక కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని వారు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న సమస్యలను.. తమ కష్టాలను చెప్పుకొనేందుకు వైసీపీ నేతలు సైతం.. కాసు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్సెస్ కాసుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ పరిణామాలతో కాసుకు వ్యతిరేకత ఓ రేంజ్లో పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు.