నాయకుల ఆస్తుల కబుర్లు ఎప్పుడు ఆసక్తికరమే. అందునా దేశాన్నిపాలించే ప్రధానమంత్రి.. అందునా మోడీ లాంటి సింఫుల్.. పరిత్యాగికి ఉన్న ఆస్తుల లెక్క బయటకు వస్తే.. లుక్ వేయని వారెవరు. ప్రధాని మోడీతో పాటు.. ఆయన ఆత్మగా వ్యవహరించే జిగిరీ దోస్త్ అమిత్ షా ఆస్తుల వివరాలు బయటకు వెల్లడించారు. రోటీన్ కు భిన్నంగా ఈసారి వారి ఆస్తుల విషయంలో చోటు చేసుకున్న లెక్క ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
మోడీ..అమిత్ షా ఆస్తుల్లో ఎవరిది పైచేయి అంటే.. షా వైపే అందరూ మొగ్గు చూపుతారు. ఆసక్తికర అంశం ఏమంటే.. ఈసారి అమిత్ షా ఆస్తుల కంటే మోడీవారి ఆస్తులు పెరిగినట్లుగా తేలింది. ఈ విషయాన్ని దారిన పోయే దానయ్య చెప్పలేదు.. ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన వివరాల్లో వెల్లడయ్యాయి. ఇంతకీ మోడీ ఆస్తులు పెరగటం ఏమిటి? అమిత్ షా ఆస్తులు తగ్గటం ఏమిటన్న కన్ఫ్యూజ్ వచ్చిందా? దాన్ని క్లియర్ చేసుకోవాలంటే కొంత లోతుల్లోకి వెళ్లాల్సిందే.
2019 జూన్ తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి మోడీ ఆస్తుల విలువ పెరిగింది. మొత్తంగా రూ.2.85 కోట్లకు చేరుకుంది.గత ఏడాది జూన్ నాటికి మోడీ వారి చేతిలో కేవలం రూ.31,450 మాత్రమే ఉండగా.. తాజాగా మాత్రం ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.3,38,173 ఉండటం గమనార్హం. గుజరాత్ లోని గాంధీనగర్ లోని ఎస్ బీఐ బ్యాంకులో ఆయన అకౌంట్ ఉంది. అదే బ్యాంకులో ఆయనకు సంబంధించి రూ.1.60 కోట్ల ఎఫ్ డీఆర్.. ఎంఓడీ బ్యాలెన్సు ఉంది. రూ.8.43 లక్షలు విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్.. రూ.1.50లక్షలు విలువ చేసే బీమా పాలసీలు ఉన్నాయి. స్థిరాస్తులు రూ.1.75 కోట్లు ఉన్నాయి.
అన్నింటికంటే ఆసక్తికర అంశం మోడీ ఇప్పటివరకు ఎలాంటి రుణాలు తీసుకోలేదట. ఆయన పేరు మీద ఒక్క వాహనం కూడా లేదని తేల్చారు. కాకుంటే రూ.1.45 లక్షలు విలువ చేసే 45 గ్రాముల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లుగా తేల్చారు. మోడీ వారి ఆదాయం పెరిగితే.. అమిత్ షా వారి ఆదాయం ఎందుకు తగ్గినట్లు? కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. షేర్ మార్కెట్ షా వారిని దెబ్బేసిందట. గత ఏడాది ఆయన రూ.32.3 కోట్ల నికర ఆస్తుల్ని వెల్లడిస్తే.. ఈ ఏడాది వాటి విలువ రూ.28.63కోట్లకు తగ్గిపోయింది. ఇవే కాకుండా రూ.1.3.56కోట్లు విలువ చేసే స్థిరాస్తి గుజరాత్ లోనే ఉంది. షా చేతిలో రూ.15,814 క్యాష్ ఉంటే.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.1.04 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. పాలసీలు.. పిక్సెడ్ డిపాజిట్లు రూ.13.47 లక్షలు.. రూ.2.79 లక్షలు ఉన్నాయి. రూ.44.47 లక్షలు విలువ చేసే బంగారం ఉన్నట్లుగా తేల్చారు. మొత్తంగా చూస్తే.. మోడీ ఆస్తుల కంటే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. కాకుంటే… గత ఏడాదితో పోలిస్తే..షా ఆస్తులు తగ్గితే.. మోడీ ఆస్తులు పెరిగినట్లుగా తేలింది. ఏది ఏమైనా కరోనా వేళ.. అందరి బడ్జెట్ లు మారిపోయి.. ఆర్థికకష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మోడీ మాష్టారి ఆస్తులు పెరగటం విశేషంగా చెప్పక తప్పదు.