ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) అమెరికాలోని సియాటెల్ లో ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో దయనీయ స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
సియాటెల్ లోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ లో మాస్టర్స్ చేసి తన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు కోటి కలలతో అమెరికాకు వచ్చిన జాహ్నవి అర్ధంతరంగా తనువు చాలించడం కలచివేసింది.
ఇక, జాహ్నవిని ఢీకొట్టిన పోలీసు పెట్రోలింగ్ కారులోని పోలీసు అధికారి జాహ్నవి ప్రాణానికి విలువ లేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
11 వేల డాలర్ల చెక్ రాసిస్తే సరిపోతుందంటూ తోటి పోలీసు ఉన్నతాధికారితో యాక్సిడెంట్ చేసిన పోలీసు అధికారి వెటకారంగా మాట్లాడిన వైనంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ TANA, BATA, AIAల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు .
జాహ్నవి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో అమెరికాలోని ఎన్నారైలు, తెలుగు వారు పాల్గొన్నారు.