ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ తో పాటు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు…వాటిని కొట్టివేసింది.
కానీ, ఈ వ్యవహారంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని అక్కడా న్యాయం జరగకుంటే సుప్రీం కోర్టుకు కూడా వెళతానని రఘురామ చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, వైసీపీకి సెప్టెంబరు 23వ తేదీ ఎంతో ముఖ్యమైనదని, కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ బెయిలుపై బయటకు వచ్చిన రోజు ఇదని రఘురామ సెటైర్లు వేశారు. తమ పార్టీకి ఇది చాలా ప్రత్యేకమైన రోజని, జగన్ బెయిల్పై బయటకు వచ్చి 8 ఏళ్లు పూర్తయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ రద్దు కాబోతున్నట్లు కోర్టు తీర్పుకంటే ముందే సాక్షి మీడియాలో రావడంపై రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పులివ్వడానికి ముందే జగన్ సొంత మీడియాలో తీర్పులు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో ఈ తీర్పును తాను ముందే ఊహించానని రఘురామ గతంలో చెప్పారు.