రాజకీయ వ్యూహకర్త, మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ్ కుమార్.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఏ ఒక్క పార్టీలోనూ లేరు. గతంలో ఉన్న పార్టీకి అనుకూలంగానులేరు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ పార్టీ గురించిన స్మరణ కూడా ఆయన మరిచిపోయారు. అయినప్పటికీ.. విశ్లేషణల పేరుతో ఉండవల్లి తరచుగా మీడియా ముందుకు రావడం.. విమర్శలు చేయడం లేదా సలహాలు ఇవ్వడం.. వంటివి ఆసక్తిగా ఉంటున్నాయి. ఆయన మీడియా మీట్లకు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ కూడా పడేవి. అరె.. ఉండవల్లి మాట్లాడాడంటే.. ఏదో సబ్జెక్ట్ ఉంటుంది!
అని అన్ని పార్టీల నాయకులు అనుకునేవారు.
ముసుగు తీసేసిన ఉండవల్లి!
ఇక, ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా.. ఆయన తనకు రాజకీయంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల అభిమానంతోను, సానుభూతితోనూ ఉండేవారు. దీంతో అదే పరంపరను ఆయన వైసీపీ వైపు మళ్లించారు. వైసీపీపై విమర్శలు చేసినా.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను గతంలో కొన్నింటిని తప్పుపట్టినా..(ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు. ఎస్సీలపై దాడులు. ఇసుక మాఫియా.. గనుల దోపిడీ.. ప్రతిపక్ష నేతలపై కేసులు.. మంత్రుల దూషణల పర్వం) చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడేవారు. వైసీపీకి ఒకింత చురకలు అంటించేవారు. అదేసమయంలో ప్రతిపక్షం టీడీపీ విషయంలోనూ బ్యాలెన్స్డ్ గా ఉండేవారు. దీంతో అన్నిపార్టీల నుంచి ఉండవల్లిపై సానుభూతి ఉంది.
జగన్‌పై దేశవ్యాప్త గగ్గోలు
మేధావిగా.. సద్విమర్శకుడిగా.. ఆయనకు నేతలు వాల్యూ ఇచ్చారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయన వైసీపీ మనిషేననే ముద్ర పడిపోయింది. పూర్తిగా ముసుగు తొలగించి.. ఫక్తు వైసీపీ నాయకుడిని మించిపోయారు. ఒకవైపు దేశవ్యాప్తంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ న్యాయవ్యవస్థను టార్గెట్ చేయడం, జస్టిస్ నూతలపాటి వెంకటరమణపై ఫిర్యాదుల చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.జగన్‌పై కోర్టు ధిక్కారం కింద కేసులు పెట్టాల్సిందేనని అన్ని బార్ అసోసియేషన్లు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తప్పని.. దానిని బహిర్గతం చేయడం మరింత ఉన్మాదమని, ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే పెనుముప్పని దేశవ్యాప్తంగా గగ్గోలు పుడుతోంది. వాస్తవానికి ప్రస్తుత కరోనా ప్యాండమిక్ లేకపోయి ఉంటే.. రోడ్డెక్కేవారమని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ చెప్పిందంటే.. ఎంత సీరియస్‌గా ఉందో అర్ధమవుతుంది.
ఉండవల్లి అడ్డగోలు సమర్థన
ఇంత కీలక సమయంలో మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి అరుణ్‌కుమార్.. స్వతహాగా తాను కూడా లాయర్‌ను అన్న విషయం మరిచిపోయారో.. ఏమో.. సీఎం జగన్‌ను అడ్డగోలుగా సమర్థించేశారనే వాదన న్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. సుప్రీం కోర్టుకు సీఎం జగన్ లేఖ రాయడం తప్పేకాదని.. ఉండవల్లి తనదైన తీర్పు ఇచ్చేశారు. అంతేకాదు.. ఎవరైనా.. ఎంతటి వారైనా.. సమానులే.. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన నిజస్వరూపం బయటపడిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు ఏకంగా.. ఆయన పని అయిపోయిందని.. ప్రస్తుత పరిస్థితిలో దేశం మొత్తం న్యాయవ్యవస్థవైపు ఉండగా.. ఉండవల్లి అరుణ్ వంటి మేధావులు ఇలా వ్యాఖ్యానించడంపై మేధావులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
వైసీపీలోనూ ఆశ్చర్యం!
ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. ఇక, ఉండవల్లి కథ ముగిసినట్టేనా? అని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. నిజానికి జగన్ వ్యవహారంలో వైసీపీలోనే నేతలు మౌనం పాటిస్తున్నారు. మావోడు.. హద్దులు దాటేశాడు. ఏం జరిగినా.. జరిగొచ్చు!
అని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇంతవరకు ఒక్కరు కూడా జగన్‌కు మద్దతుగా నోరు విప్పిన నాయకులు కనిపించడం లేదు. ఈ సమయంలో ఉండవల్లి వ్యాఖ్యలు.. వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతుండడం గమనార్హం.