ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహ రచన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రష్యా సేనలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ నాయకత్వంలోని ఉక్రెయిన్ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పుతిన్, జెలెన్ స్కీల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకిచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
పుతిన్ చిన్న కూతురు ఎకతెరీనా.. జెలెన్స్కీతో రహస్యంగా సహజీవనంలో ఉన్నట్టు షాకింగ్ కథనం వెల్లడైంది. అయితే, అతడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కాదు….జర్మనీకి చెందిన ఇగోర్ జెలెన్స్కీ. పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన జర్మనీలో ఇగోర్ జెలెన్ స్కీతో ఎకతెరీనా సహజీవనం చేస్తున్నట్టు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడం సంచలనం రేపింది.
35 ఏళ్ల ఎకతెరీనా…52 ఏళ్ల మాజీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన ఇరోర్ జెలెన్ స్కీతో సహజీవనం చేస్తోందట. అంతేకాదు, వారికి రెండేళ్ల పాప కూడా ఉందని కథనంలో పేర్కొనడం సంచలనం రేపింది. ఇగోర్ జెలెన్స్కీ ఇంటి పేరు పుతిన్ ప్రత్యర్థి, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఇంటిపేరు ఒకటే కావడంతో పుతిన్ కు పుండుమీద కారం చల్లినట్లుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి, ఈ పుకార్లలో నిజానిజాలేమిటో తెలీదుగానీ…వాటిని మాత్రం పుతిన్ ఖండించలేదు.