తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు బలమైన తీర్పునే ఇచ్చారు. కూటమి పార్టీలకు ఏకంగా 164 అసెంబ్లీ స్థానాలను అప్పగించడం ద్వారా ప్రజలు తాము ఏమి కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రధానంగా రెండు విషయాలు ప్రజల మధ్య చర్చకు వచ్చాయి. ఒకటి రాజధాని రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ రెండు విషయాల పైన ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచే పాలన చేస్తానని అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
అదేవిధంగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు విషయాన్ని చూస్తే తామ అధికారంలోకి వస్తే అమరావతిని పరుగులు పెట్టిస్తామని నవ్యాంధ్రకు నవ నగరాలతో కూడిన రాజధాని నిర్మిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి ఉపాధి కల్పనకు సంపద సృష్టికి బాటలు పరుస్తామని చెప్పారు. దీంతో ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మూడు రాజధానుల విషయాన్ని ప్రజలు తిప్పి కొట్టారని భావించాలి.
అలాంటప్పుడు ఇక విశాఖను రాజధానిగా చేయటం కానీ కర్నూలు న్యాయ రాజధాని చేయడం కానీ ప్రస్తుతం ఉన్న అమరావతిని కేవలం అసెంబ్లీ కార్యక్రమాలకు పరిమితం చేయటం కానీ ఉండదు. ఈ విషయంలో ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. తమకు రాజధానిగా అమరావతి మాత్రమే కావాలని కోరుకున్నారు. ఇక పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కూడా రాజధాని అమరావతిని పరుగులు పెట్టించేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో చర్చించి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదేవిధంగా కేంద్రం నుంచి 15 వేల కోట్ల రూపాయలను తెచ్చుకుని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మారబోదని చెప్పారు. అంటే మూడు రాజధానులకే తమ పార్టీ అదేవిధంగా తమ పార్టీ అధినేత జగన్ సహా తమ పార్టీ నాయకులు కూడా కట్టుబడి ఉన్నారని బొత్స సత్యనారాయణ బల్లగుద్దినట్టు చెప్పుకొచ్చారు.
కానీ ప్రజలు మాత్రం అమరావతికే ముగ్గు చూపిన విషయం ఆయన గ్రహించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఈ విషయం చర్చకి రావడం ప్రజలు అమరావతి వైపే ముగ్గు చూపడం దీనికి సంబంధించి స్పష్టమైన తీర్పు కూడా ప్రజలు ఇచ్చిన నేపథ్యంలో వైసిపి తన పంథా మార్చుకుంటుందని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా ఆ పార్టీ మాత్రం తన పంథాను తన ఆలోచనను ఎక్కడా మార్చుకోకపోవడం తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం గమనిస్తే ఇక వీరు ప్రతిపక్షానికే పరిమితం అవుతారా అని అనిపిస్తోంది.
అంతేకాదు.. తమ ఆలోచనను మార్చుకోరా ప్రజల తీర్పుకి కట్టుబడి ఉండరా అనే అంశాలు మేధావుల నుంచి రాజకీయ నాయకుల దాకా చర్చకు వస్తున్నాయి. సహజంగా ఏ నాయకుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి దానిపై వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి నాయకుడే అనేక సందర్భాల్లో వెనక్కి తగ్గారు. రైతులకు సంబంధించి తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో వ్యతిరేకత రావడంతో ఆయన వాటినే రద్దు చేసేశారు.
మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డికి ఎంత పరాభవం ఎదురైనా ఎందుకని మూడు రాజధానులకే పట్టుబడుతున్నారు. ఇంకా ఆయన వాస్తవాలు, ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదా ఇక చేయరా అనే విషయాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ ఇప్పుడు కనక మారకపోతే భవిష్యత్తు మరింత అంధకారం కావడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.