మరో ఎనిమిది మాసాల్లో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోనూ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అటు మోడీ, ఇటు వైసీపీ జగన్ గెలిస్తే.. ఏం జరుగుతుంది? అసలు వారు గెలుస్తారా? అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. నిజానికి కేంద్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల కన్నా కూడా ఉత్తారాదిలో ప్రజలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. మోడీ పాలన అవసరం లేదని చెబుతున్న వారు పెరుగుతున్నారు. వాస్తవానికి కేంద్రంలో ఏ పార్టీ అయినా.. సర్కారు ఏర్పాటు చేయాలంటే.. ఉత్తరాది రాష్ట్రాలే కీలకం.
అయితే ఇక్కడ కూడా చిన్న సమస్య ఉంది. ప్రత్యామ్నాయ నాయకుడు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు `ఇండియా` కూటమిలో కీలకమైన నాయకుడిగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇక, మోడీ విషయానికి వస్తే.. ఆయన మరోసారి వస్తే.. దేశంలో కీలకమైన హిందూత్వ మార్పు జరుగుతుందని భయపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా చెబుతోంది.
అంతేకాదు.. ఇప్పటి వరకు జాతీయ పార్టీలపైనా.. ఆ పార్టీలకు చెందిన నాయకులపైనా సీబీఐ, ఈడీ వంటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే. మోడీకి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రాంతీయ పార్టీలకు కూడా.. మోడీ చెక్ పెడుతున్నారనేది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్.. ఇలా .. రాష్ట్రాల వారీగా తీసుకుంటే.. తనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ప్రాంతీయ పార్టీలను కూడా అదును చూసి దెబ్బకొడుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మోడీ మరోసారి వస్తే.. ప్రాంతీయ పార్టీల వ్యవస్థ పట్టు తప్పిపోయినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మెజారిటీ ప్రజలు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీ విషయానికివస్తే.. అప్పుల కుప్పలు పెరిగిపోతుండడం, అభివృద్ది లేమి, రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోవడం.. వంటివి ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అదేసమయంలో ఇక్కడ కూడా ప్రత్యర్థులను నయానో భయానో లొంగదీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో ప్రజలు కూడా ఆదిశగా ఆలోచన చేయాలని అంటున్నారు. సో.. మరోసారి అటు కేంద్రంలో బీజేపీ, ఇటు ఏపీలో వైసీపీ వస్తే.. ఇబ్బందులు మరింత పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుండడం గమనార్హం.