ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టదలచిన వినూత్న కార్యక్రమం ‘ఇదేం ఖర్మ’ ట్రయల్ రన్ అన్నట్టుగా కృష్ణాజిల్లా నాయకులు ఒక కార్యక్రమం నిర్వహించారు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా ఇది సక్సెస్ కావడం గమనార్హం.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యనమలకుదురు గ్రామాన్ని- విజయవాడ బందరు రోడ్డుకు అనుసంధానిం చేందుకు వీలుగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి 90శాతం పనులు పూర్తయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. దీన్ని నిరసిస్తూ యనమలకుదురు బ్రిడ్జికి `ఇదేం ఖర్మ` అంటూ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు.
కొందరు వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని ప్రతిగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు బాహీబాహీకి దిగే క్రమంలో పోలీసులు వారిని నెట్టడంతో తోపులాట జరిగింది. వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన కొనసాగించారు. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు పెట్టుకున్న నిచ్చెనను పైకి తీసేసుకోవటంతో వారిని కిందకు దించటం పోలీసులకు కష్టతరమైంది. పోలీసులు తమ నేతల్ని అరెస్టు చేస్తే బందరు కాలవలోకి దూకుతానంటూ బోడేప్రసాద్ బ్రిడ్జ్ బెదిరించారు.
పోలీసులు లైఫ్ జాకెట్లు, తాడులు కూడా సిద్ధం చేశారు. బ్రిడ్జి పైకెక్కి టీడీపీ నేతల్ని దించే మార్గం కనిపించకపోవటంతో పోలీసులు చర్చల మార్గం ఎంచుకున్నారు. వైసీపీ నేతల్ని వెనక్కి పంపించి పోలీసులూ వెనక్కి వెళ్లిపోవాలన్న టీడీపీ నేతల షరతుల్ని అంగీకరించి అందుకనుగుణంగా వ్యవహరించటంతో ఉద్రిక్తత సడలింది. కొనకళ్ల నారాయణ బ్రిడ్జి దిగి వాహనంలో యనమలకుదురు దాటి వెళ్లే వరకూ బోడే ప్రసాద్ దిగలేదు. కానూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల వద్ద కూడా పూర్తికాని మరో బ్రిడ్జిపై త్వరలోనే నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు.