తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, తిరుపతి లోక్సభ రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
ఇక, ఈ పిటిషన్లో.. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ ప్రధానమైనదని.. ఈ నెల 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగలేదని పిటిషన్లో రత్నప్రభ పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందినవారు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని.. బూత్ ఆక్రమణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని తెలిపారు. అంతేకాదు.. పోలింగ్ సందర్భంగా చట్టబద్ధమైన ఓటర్లకు బదులుగా నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేయడానికి ప్రజలు భారీగా తరలివచ్చారని, ఆ గుర్తింపు కార్డులపై సీరియల్ నంబరుతో ఓ స్టిక్కర్ అంటించి ఉంది. ఎన్నికల అధికారులు, పార్టీ ఏజెంట్లు ప్రశ్నించినప్పుడు దొంగ ఓటర్లు కనీసం తమ చిరునామా, తండ్రి పేరు వంటి ప్రాథమిక వివరాలు కూడా చెప్పలేకపోయారని రత్నప్రభ పేర్కొన్నారు.
ఓకే ! ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. రత్న ప్రభ చుట్టూ ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటంటే.. “మీరు పోటీ చేసిన పార్టీ చిన్నా చితకా పార్టీ యేమీ కాదు. బీజేపీ కేంద్రంలో బలమైన పక్షంగా అధికారంలో ఉంది. పైగా కేంద్రంలో మంత్రి వర్గం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?“ అని నిలదీస్తున్నారు. అదేసమయంలో “కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఆదేశాలకు విలువ ఇస్తుంది. సో.. మీరు కేంద్రం ద్వారా చక్రం తిప్పి.. తిరుపతి ఉప ఎన్నిక ఆగిపోయేలా ఎందుకు ప్రయత్నించలేదు? “ అని ప్రశ్నిస్తున్నారు. ఇక, మరికొందరైతే.. కేంద్రంలోని బీజేపీ నేతలు.. తిరుపతిలో మీరు(రత్నప్రభ) చెప్పినట్టు అక్రమాలు చోటు చేసుకుని ఉంటే.. వారెందుకు మౌనంగా ఉన్నారు? అని కూడా నిలదీస్తున్నారు.
కేంద్రం ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మీరు(రత్న ప్రభ) కోర్టును ఆశ్రయించారంటే.. ఈ విషయంలో ఏదో అనుమానించాల్సిన పరిస్థితి నెలకొందని అనే వారు కూడా ఉన్నారు. మొత్తంగా కోర్టుకు వెళ్లినంత తేలిగ్గా.. రత్న ప్రభ వ్యవహారం ముగిసేలా కనిపించడం లేదు.పైగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కోర్టు వ్యవహారంలో తమ జోక్యం లేనట్టే వ్యవహరిస్తున్నారు. కేవలం రత్న ప్రభే పిటిషన్ వేయడం.. దీనిని రాష్ట్ర నేతలు ఎవరూ ఎండార్స్ చేయకపోవడం వంటివి కూడా ఆమె చుట్టూ ప్రశ్నలు అల్లుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టుగా ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.