ఆమె మహిళా ఐఏఎస్. వైఎస్ జమానాలో గనుల శాఖ కార్యదర్శిగా కీలక పదవిని అలంకరించారు. ఈ క్రమంలోనే `పెద్దల` కనుసన్నల్లో ఆమె చేయి విదిల్చారనే పేరు తెచ్చుకున్నారు. ఫలితంగా అతి చిన్న వయసులోనే ఎంతో ఫ్యూచర్‌ను కోల్పోయారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆమే.. ఐఏఎస్ శ్రీలక్ష్మి. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన ప్రముఖ ఖనిజ వ్యాపారి.. గనుల ఘనుడు.. గాలి జనార్ధన్ రెడ్డి తీసుకున్న ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి కూడా ఆరో నిందితురాలిగాఉన్నారు. గాలి కుటుంబం వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితమనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి వైఎస్ కనుసన్నల్లోపనిచేశారని.. గనులకు సంబంధించి.. ఇష్టానుసారం చేతివాటం చూపించారని సీబీఐ కేసులు నమోదు చేసింది. దీంతో కొన్నేళ్ల కిందట ఆమె జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అప్పట్లో తీవ్ర విమర్శలు అదేసమయంలో అతి పిన్న వయసులోనే జైలు జీవితం గడిపి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే చాన్స్ మిస్ చేసుకున్నారనే సానుభూతి కూడా కనిపించింది. అయితే.. ఇప్పుడు మళ్లీ శ్రీలక్ష్మి తెరమీదికి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ ఐఏఎస్ కేడర్‌లో ఉన్న శ్రీలక్ష్మిని.. సీఎం జగన్ పట్టుబట్టి.. ఏపీకి రప్పించుకున్న విషయం తెలిసిందే.
అంతేకాదు.. ఆమెకు గ్రేడ్ పెంచి ఇటీవలే జీతం కూడా రెండున్నర లక్షలకు పెంచారు. ఇదిలావుంటే.. ఓబులాపురం కేసు విచారణ సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే రెండు సార్లు.. కోర్టునుంచి తాఖీదులు అందుకున్నారు. విచారణకు వచ్చిన కేసులో వాదనలు వినిపించడం లేదని న్యాయమూర్తి మధుసూదన్ రావు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే.. తాము హైకోర్టుకు వెళ్లామని.. కేసు విచారణ సాగాల్సి ఉందని.. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది చెబుతూ వచ్చారు. దీనిపై సీబీఐ కూడా కౌంటర్ వేసిందన్నారు.
అయితే.. న్యాయమూర్తి మధుసూదన్‌రావు మాత్రం ఈ నెల 29ని డెడ్‌లైన్‌గా విధించారు. ఆ రోజు జరిగే విచారణకు శ్రీలక్ష్మి వాదనలు వినిపించకపోయినా.. ఈలోగా.. హైకోర్టు స్టే ఇవ్వకపోయినా.. తుది తీర్పు వెలువరుస్తామని.. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దీంతో ఇప్పుడు శ్రీలక్ష్మి ఫ్యూచర్‌పై మళ్లీ చర్చ కొనసాగుతోంది. ఇదే విషయంపై ఉన్నతస్థాయిలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.