కాలం, ఖర్మం కలిసిరాకపోతే…తాడే పామై కరుస్తుందన్నది పెద్దలు చెప్పిన సామెత. అధికారం ఉంది కదా…మనం చెప్పినట్టు సాగుతుంది కదా…అని సాగించుకుంటే.. మన టైం బ్యాడ్ అయినపుడు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతాయన్నది జగమెరిగిన…జగన్ ఎరిగిన సత్యం..కూడా. ప్రస్తుతం ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి సరిగ్గా ఇదే రకమైన సంకట పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది.
రెండేళ్లుగా ఏపీలో చక్రం తిప్పిన ఆ ఐఏఎస్…హఠాత్తుగా…అంతకంటే హడావిడిగా హస్తినాపురిలో పోస్టింగ్ కోసం హాహాకారాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో అంత చక్రం తిప్పిన ఆ ఐఏఎస్ కేంద్ర సర్వీసుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న చాలామంది ఐఏఎస్ ల మెదళ్లనుతొలిచివేస్తోందట. తనను కేంద్ర సర్వీసులోకి తీసుకోవాలని సదరు ఐఏఎస్ అధికారి ఢిల్లీలో ఎక్కని గుమ్మం లేదట.
http://www.youtube.com/watch?v=t5ypAz_37Hs
ఏపీలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈ ఐఏఎస్ అధికారికి సాటి సీనియర్ ఐఏఎస్ లు కూడా సలాం కొట్టాల్సిందేనట. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ ఐఏఎస్ అధికారికి కేంద్ర సర్వీసుకు వెళ్లడం నల్లేరు మీద నడకే అనుకుంటే పొరపాటే. ఆ ఐఏఎస్ అధికారి నడవడికే ఆయన ఢిల్లీ బదిలీకి అడ్డంకిగా మారిందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే, కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు కొద్ది రోజులుగా ఆ అధికారి చేస్తున్న విశ్వప్రయత్నాలు వృథా ప్రయాసలుగా మిగిలిపోయాయట.
రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ఐఏఎస్ అధికారులను కేంద్రం ఎంపానెల్ చేయాల్సి ఉంటుంది. గతంలో అయితే వార్షిక నివేదిక, క్లీన్ చిట్ ఉంటే ఎంపానెల్ వెంటనే చేసేవారు. కానీ, మోడీ సర్కార్ వచ్చాక 360 డిగ్రీల అప్రయిజల్ విధానం తెచ్చింది. దీని ప్రకారం ఏసీఆర్ తో పాటు మరో రహస్య నివేదిక అవసరం. ఆ అధికారి గురించి ఐదుగురి దగ్గర నుంచి రహస్య సమాచారం తెప్పించుకొన్న తర్వాత…ఆ 5గురు చెప్పేదాన్ని బట్టి కేంద్రం ఎంపానెల్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తుంది.
అయితే, సదరు ఐఏఎస్ అధికారి గురించి ఐదుగురు సభ్యులు కూడా నెగిటివ్ మార్కులు ఇచ్చారట. కనీసం పర్వాలేదు అని కూడా నివేదికలో చెప్పకపోయే సరికి సదరు ఐఏఎస్ ను కేంద్రం పక్కనబెట్టిందట. ఒకసారి పక్కనబెట్టిన వారు మరోసారి ఎంపానెల్ కావాలంటే 15 మంది సభ్యులతో మంచివాడనిపించుకోవాలట. అది సాధ్యం కాదని తెలుసుకున్న ఆ ఐఏఎస్ అధికారి ఎలాగైనా ఎంపానెల్ లో చేరాలని… అడ్డమైన పనులు చేస్తూ, అందరి కాళ్లు పట్టుకుంటున్నారట.
ఢిల్లీలో తనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి సదరు ఏపీ ఐఏఎస్ అధికారి క్విడ్ ప్రోకో ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఏపీ సీఎంకు చెప్పి ఏపీలోనే ఓ కీలక పదవి ఇప్పిస్తానని, రిటైర్ అయిన తర్వాత కూడా మంచి హోదాలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారట. అంతేకాదు, ఈ సీనియర్ ను ఏపీలో సెట్ చేసేందుకు ఏపీలో ఆల్రెడీ ఉన్న మరో ఏపీ సీనియర్ ఐఏఎస్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
గతంలో కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవం ఉండి, రెండేళ్లుగా ఏపీలో చక్రం తిప్పిన సదరు ఐఏఎస్ అధికారి…ఇపుడు ఢిల్లీలో కాలికి చక్రం కట్టుకొని ఎందుకు తిరుగుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.