సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్ కక్షసాధింపు చర్యలు ఇంకా మానలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీపై అక్కసుతోనే ఏబీవీని సస్పెండ్ చేశారని, లేనిపోని అభాండాలు ఆయనపై వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏబీవీకి ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశమైంది. పెగాసస్ సాఫ్ట్వేర్ వ్యవహారంలో తనపై ఆరోపణలు రావడంతో ఏబీవీ మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.
నిబంధనల ప్రకారం ముందస్తుగా ప్రభుత్వం అనుమతి లేకుండా ఆయన ఆ సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని ఆయనకు ప్రభుత్వం మెమో ఇస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారంలో వివరణనివ్వాలని హుకుం జారీ చేసింది. ఈ క్రమంలోనే. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వానికి వివరణ ఇస్తూ లేఖ రాశారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై స్పందించవచ్చని, దానికి నిబంధనలు అడ్డురావని ఆయన అన్నారు. ఆ
ఆలిండియా సర్వీస్ రూల్స్ తనకు ఆ అవకాశం కల్పించాయని, రూల్-17కి అనుగుణంగానే తాను గత నెల మీడియాతో మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. తాను గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్వేర్ వినియోగించలేదని మాత్రమే మీడియా సమావేశంలో చెప్పానని , ఆలిండియా సర్వీస్ రూల్-6 ప్రకారం అధికారిక అంశాలపై వివరణ ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం… అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని ఏబీవీ అన్నారు.
తాను ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించలేదని, నిబంధన ప్రకారం తాను మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించలేదని క్లారిటీ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేస్తే దానిపై స్పందించకూడదా? అని ఏబీవీ ప్రశ్నించారు. ఆర్టికల్-21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని, మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయంపై ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని ఏబీవీ తన లేఖలో పేర్కొన్నారు. మరి, ఏబీవీ వివరణపై ప్రభుత్వం స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.