టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరులో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు పాదయాత్ర సందర్భంగా బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. జగన్ పాలనలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని కురుబలంతా లోకేష్ కు మొరపెట్టుకున్నారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తర్వాత వచ్చిందని లోకేష్ అన్నారు.
కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీనే అని, 90 శాతం సబ్సిడీ తో రూ.10 లక్షల వరకు రుణాలిచ్చామని, మినీ గోకులాలు నిర్మించామని లోకేష్ అన్నారు. కురుబల గొంతు కోసిన జగన్ రిజర్వేషన్లు కట్ చెయ్యడం వలన కురుబలంతా నష్ట పోయారని వెల్లడించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ పీకింది ఏంటి… కురబలకి చేసింది ఏంటి? అని నిలదీశారు. రిజర్వేషన్లు తగ్గించామపి బీసీ శాఖా మంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో కురబలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు.
చెత్త మీద పన్ను వేసినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా? కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా? అని దుయ్యబట్టారు. తాను జగన్ లా దొంగ హామీలివ్వనని, నెరవేర్చే హామీలే ఇస్తానని లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖర్చులతో కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
పలమనేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తున్న లోకేష్…మార్గ మధ్యలో పొలంలో నాట్లు వేస్తున్న మహిళల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. పొలాల్లో పనిచేస్తున్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ లోకేశ్ ముందుకు సాగారు.