నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలకు ఆ పార్టీ మాజీనేత, టీడీపీ ఎమ్మెల్యు రఘురామ పక్కలో బల్లెంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ పాలనను ఎండగడుతూ ఆయన తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలు, నియంతృత్వ పోకడలను రఘురామ ఎండగట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జగన్ పై, వైసీపీపై విమర్శలు చేసి తన టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. తనతోపాటు ప్రజల దృష్టి కూడా జగన్, వైసీపీ నేతలపై ఉండదు, ఉండకూడదు అని వివరించారు.
ప్రజలు తమకు అధికారం కాదు బాధ్యతను కట్టబెట్టారని, అందుకే ప్రజా సమస్యలపై, పాలనపై ఫోకస్ చేసేందుకు తన సమయం మొత్తం కేటాయిస్తానని చెప్పారు. ప్రజా ప్రతినిధిగా తన విలువైన సమయాన్ని వైసీపీ నేతలను, జగన్ ను విమర్శించేందుకు ఉపయోగించదలుచుకోలేదని అన్నారు. అయితే, తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై న్యాయపోరాటం చేస్తానని, చట్టప్రకారం తనను టార్చర్ పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.
‘మంచో చెడో చేయాల్సింది చేశాడు వెళ్లిపోయాడు.. ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇప్పుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా.. ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తాం’ అని రఘురామ చెప్పారు.