టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్…వైసీపీ నేతల దాడుల్లో గాయపడ్డ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల గోడు విన్న లోకేష్ తీవ్రంగా చలించిపోయారు. ఈ క్రమంలోనే జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. కులం ఫ్యాక్షనిజం..మతం సైకోయిజం…అది జగన్ నైజం అని నిప్పులు చెరిగారు.
అందుకే రాష్ట్రంలో జగన్ మారణహోమం సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. బ్యాంకుల నుంచి లక్ష కోట్లు దొబ్బి 14 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న 420 సీఎం కావడం వల్లే టీడీపీ నేతలతో పాటు ప్రజలు నరకం చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను తాము రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారని, తమ వాళ్ళు చస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని లోకేష్ ప్రశ్నించారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఇక తమ ఓపిక నశించిందని, తమ వాళ్ళ జోలికొస్తే సమరమేనని లోకేష్ సవాల్ విసిరారు.
వేలాది మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని, అకారణంగా 64 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇకపై చంద్రబాబు ఆగమన్నా ఆగే ప్రసక్తే లేదని నిప్పులు చెరిగారు. జగన్ శ్రీకారం చుట్టిన రాక్షస పాలనకు తాను ముగింపు పలుకుతానని అన్నారు. టీడీపీ కార్యకర్తలను హతమార్చి కొంతమంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఉపేక్షిస్తుంటే ఏకంగా తమ పార్టీ అధినేతపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. మరోసారి చంద్రబాబు జోలికి వస్తే జరగబోయే పరిణామాలకు జగనే బాధ్యుడని వార్నింగ్ ఇచ్చారు.