మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం రేపు విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాజకీయాల గురించి, సినిమాల గురించి పలువురు సినీ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పొలిటికల్ రీఎంట్రీ, మల్కాజ్ గిరి ఎంపీగా టీఆర్ఎస్ తరఫున ఉపాసన పోటీ పుకార్లపై అడిగిన ప్రశ్నకు చిరు సెటైరికల్ గా స్పందించారు.
“ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారో గానీ వాళ్లు గొప్ప క్రియేటర్స్… అలాంటివాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందించవచ్చు… ఆ కథలతో అద్భుతమైన సినిమాలు వస్తాయి” అంటూ చిరు తన కామెంట్స్ తో నవ్వులు పూయించారు. ఈ సినిమాలో రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు లేవని, కథ ప్రకారం డైలాగులు రాశారని అన్నారు. పవన్ అధినేతగా ఉన్న జనసేనకు భవిష్యత్తులో తాను మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంవమయ్యాయి.
పవన్ నా తమ్ముడు…నిబద్ధత, నిజాయితీ ఉన్న నేత …ఇన్నేళ్లుగా ఆ నిబద్ధత చెక్కు చెదరలేదు…చిన్నప్పటి నుంచి పవన్ తన మనస్తత్వాన్ని ఏమాత్రం మార్చుకోలేదు…అలాంటి నాయకుడు రావాలన్న ఆకాంక్ష తనకుందని, భవిష్యత్తులో ప్రజలు పవన్ ను పట్టం కట్టవచ్చేమో అంటూ చిరు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. తన తమ్ముడిగా పవన్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చిరు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
భవిష్యత్తులో పవన్ ఏ పక్షాన ఉంటాడనేది ప్రజలే నిర్ణయిస్తారని, తామిద్దరం చెరోవైపు ఉండటం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్‌కు హెల్ప్ అవుతుందేమోనని భావించానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ చేసినప్పటికీ…భవిష్యత్తులో జనసేనకు జై కొట్టే అవకాశాలున్నాయని చిరు స్వయంగా చెప్పడంతో మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి కొన్నేళ్లకైనా మెగా బ్రదర్స్ కలిసి జనసేనను అధికారంలోకి తీసుకువస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.