వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో పవన్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సంస్కారం గురించి మాట్లాడడం సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లందని రోజా సెటైర్లు వేశారు. జగన్ కు సంస్కారం నేర్పించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతుడని, అటువంటి కొడుకు తనకు పుట్టలేదని చంద్రబాబు బాధపడని రోజు లేదని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తండ్రి గర్వపడే కొడుకు జగనన్న అని, తండ్రిని మించిన కొడుకు కూడా అని రోజా వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోడీల జోలికి వెళితే పవన్ కళ్యాణ్ మక్కెలిరగ్గొడతారని, అందుకే వారిని పల్లెత్తు మాట అనడని రోజా విమర్శలు గుప్పించారు. జగన్ ది సాఫ్ట్ నేచర్ అని, మంచోడని, అందుకే సహనంగా ఉంటున్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ పనికిమాలినోడని, పవన్ ను లాగి కొట్టాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వాలంటీర్లపై ఉసిగొల్పుతున్నాడని, రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న పవన్ ను ప్రజల తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
సచివాలయ వ్యవస్థ అసెంబ్లీలో చట్టం చేస్తే వచ్చిందని, పవన్ శాసనసభకు వచ్చి ఉంటే ఆ విషయాలు తెలిసి ఉండేవని చురకలంటించారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చని, ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు, పిచ్చి గంతులు తప్ప ఏమీ తెలియని ఎద్దేవా చేశారు. గతంలో జన్మభూమి కమిటీలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని రోజా నిలదీశారు.