సీఎం జగన్ తో సినీ పెద్దల భేటీ వ్యవహారం నేడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను మంచు విష్ణు కలవడం..మోహన్ బాబును ప్రభుత్వం తరఫున ఆ భేటీకి పిలిచినా…ఆయనకు ఆహ్వానం అందకుండా కొందరు అడ్డుకున్నారని విష్ణు కామెంట్లు చేయడం కాక రేపింది. ఇక, ఈ రోజే జగన్ తో కుటుంబసమేతంగా భేటీ అయిన అలీ కూడా జగన్ తో చిరు అండ్ కో భేటీపై స్పందించారు. చిరును జగన్ గౌరవంగానే చూశారని, అవమానించలేదని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆ రోజు జగన్ నుంచి ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సీఎం జగన్ తో భేటీకి రావాలని తనను పిలిచారని, కానీ, తాను వెళ్లలేదని చెప్పారు. అంతేకాదు, జగన్ ను తాను కలవబోనని, ఆయనను కలిసే అవకాశం లేదని బాలయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టికెట్ రేట్ల వ్యవహారంపై కూడా బాలయ్య స్పందించారు.
టికెట్ ధరలు తక్కువగా ఉన్నపుడే ‘అఖండ’ రిలీజ్ అయి ఘన విజయం సాధించి మంచి వసూళ్లను రాబట్టిందని బాలయ్య గుర్తు చేశారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని చెప్పారు. భవిష్యత్తులో కూడా తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచబోనని చెప్పారు. సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో ఇండస్ట్రీలో అందరూ తీసుకునే నిర్ణయానికే తాను కూడా మద్దతిస్తానని బాలయ్య గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.