విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించడం లేదని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వారికి కేటాయించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు కేశినేనికి టిడిపి నేతలతో సందేశం పంపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే తన ఇంకా మంచి స్థాయిలో ఉండేవాడినని నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనని చంద్రబాబు వద్దనుకున్నారని, తాను అనుకోలేదని నాని చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని నాని అన్నారు. బెజవాడ ప్రజల మీద తనకు నమ్మకముందని, తాను ఏం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తానని తాను గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లుగా బెజవాడను అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు, ప్రజలకు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకో ఫ్లైట్ లో వెళ్లాలని, ఒకవేళ ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్లాలని పార్టీ మారే విషయంపై నాని హింట్ ఇచ్చారు. నామినేషన్ల చివరి రోజు దాకా నాన్చకుండా ముందుగానే టికెట్ లేదని చెప్పేశారని నాని అన్నారు.
తనమీద తాను చెప్పదలుచుకున్నదంతా ఫేస్బుక్ పోస్టులో సవివరంగా చెప్పేశానని, ఎవరికి అర్థం అయినట్లు వాళ్ళు రాసుకోవచ్చు అని మీడియా ప్రతినిధులనుద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చాలా రోజులుగా మీడియాను పట్టించుకోవడం మానేశానని, మీడియాకు మసాలా కావాలని అన్నారు. తినబోతూ రుచులు ఎందుకని, ఒకే రోజు అన్ని విషయాల గురించి మాట్లాడడం ఎందుకని నాని చురకలంటించారు. రేవంత్ రెడ్డి దొంగ అని ఓ వర్గం మీడియా తెలంగాణలో ప్రచారం చేసిందని, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారని, మీడియా పీకింది ఏముందని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.