ఎన్‌కౌంటర్లకే భయపడను… అరెస్ట్‌లకు భయపడతానా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న జనసేనాని రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు పడగొట్టారని దేవతామూర్తుల విగ్రహాలు కూలగొట్టారని మండిపడ్డారు. అయితే వైఎస్ విగ్రహాలు పడగొట్టరని అడ్డుగా ఉన్నా, అవసరం లేకున్నా పోలీసులు రక్షణ కల్పిస్తారని అన్నారు.
‘‘ఇప్పటంలో విగ్రహం అవతల ఉన్న నివాసాలను కూల్చేశారు. రోడ్డు పక్కన ఉన్న వైఎస్ విగ్రహం మాత్రం అడ్డు లేదంట. ఇదీ వైసీపీ అకృత్యాలకు నిదర్శనం’’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలుత ఆయన గ్రామంలో నడుస్తూ కూల్చివేసిన ప్రతీ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాస్తులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
పలువురు మహిళలు పవన్‌కు బాధ చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయ కక్షలతోనే ఇళ్లు కూల గొట్టారని ఆవేదన చెందారు. జనసేన పక్షాన అండగా ఉంటానని, అధైర్య పడవద్దని బాధితులకు పవన్ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని తెలిపారు. మరోవైపు గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. వైఎస్ విగ్రహాల వరకు ముళ్ల కంచెలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా… అంతకు ముందు ఇప్పటం గ్రామానికి బయలు దేరిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాలను నిలిపివేశారు. దీంతో పవన్ దాదాపు మూడు కిలో మీటర్ల మేరక నడుచుకుంటూ ముందుకు సాగారు. ఈ పర్యటనలో జనసేన నేతలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం 10 మందిని మాత్రమే అనుమతించారు.